పైలట్ల సమ్మె... లుఫ్తాన్సా విమానాలు రద్దు

3 Sep, 2022 05:15 IST|Sakshi

న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం పైలట్లు ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సంస్థ విమానాలు ప్రపంచమంతటా నిలిచిపోయాయి. వందలాది విమానాల రాకపోకలను లుఫ్తాన్సా యాజమాన్యం రద్దు చేసింది. వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిచాలన్న డిమాండ్లతో పైలట్లు తమ విధులను బహిష్కరించారు.  శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు రద్దయ్యాయి. టర్మినల్‌–3 వద్ద దాదాపు 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.

వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎయిర్‌పోర్టు బయట ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే రుసుము తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు. ప్రయాణికుల్లో చాలామంది విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాసేపు వేచి చూసి, చేసేది లేక ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అతిత్వరలో విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని లుఫ్తాన్సా ప్రతినిధులు వెల్లడించారు.     

మరిన్ని వార్తలు