M K Stalin: తమిళనాడు సీఎం బహిరంగ లేఖ

10 May, 2021 08:51 IST|Sakshi

క్లిష్ట సమయంలో పాలనా బాధ్యతలు

పదేళ్ల కష్టాలు, కన్నీటిని తుడిపేస్తా

రేపు అసెంబ్లీ సమావేశం 

పొటెం స్పీకర్‌గా పిచ్చాండి

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆదివారం ప్రజలకు బహిరంగ ఉత్తరం రాశారు. ‘‘తమిళనాడు ప్రగతిపై నేను కన్నకలలు నెరవేర్చుకునే మంచి అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నాను. ప్రజలు కోరుకునే సుపరిపాలన అందిస్తానని హామీ ఇస్తున్నాను. పదేళ్ల కష్టాలు, కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నిస్తా’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. 

 ఆ ఉత్తరంలోని ప్రధాన అంశాలు.. 
‘‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే విశ్వాసంతోనే సీఎంగా బాధ్యతలు స్వీకరించి విధుల్లోకి దిగాను. ప్రభుత్వ బాధ్యత అనేది పూలపాన్పుకాదు, ముళ్ల పాన్పు. కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకోవడం ద్వారా వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నాను. వీటిల్లో ఏ ఒక్కటీ విస్మరించకుండా నెరవేర్చే అవకాశం నాకు దక్కింది. అన్ని రంగాల అభివృద్ధిలో తమిళనాడును అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు మళ్లీ తలెత్తుకునేలా చేయాలి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం నా కర్తవ్యం.  

పదేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలతో మోసపోయిన ప్రజలు నా నుంచి ఎంతో ఆశిస్తున్నారని అర్థం చేసుకోగలను. గతాన్ని తలుచుకుని   చింతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చీకటిని తిట్టుకునేకంటే దాన్ని పారద్రోలే దీపాన్ని వెలిగించడం మంచి లక్షణం. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ కష్టకాలాన్ని ఒక సవాల్‌గా తీసుకుంటున్నాను. పారదర్శక పాలన అందిస్తాను. విజయోత్సవం జరుపుకునే తరుణం కాదు, కష్టాల్లో ఉన్నవారికి భరోసా కల్పించాల్సిన సమయం’’ అని పేర్కొన్నారు. డీఎంకే కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలతో స్నేహితుల్లా మెలగాలని కోరారు.
 
రేపే తొలి అసెంబ్లీ 
తమిళనాట ఎన్నికలు ముగిసిన తర్వాత డీఎంకే నేతృత్వంలో తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం జరగనుంది. చెన్నైలోని కలైవానర్‌ అరంగంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో 16వ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వకారం చేయిస్తారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకుంటారు.

అడ్వకేట్‌ జనరల్‌గా షణ్ముగ సుందరం 
తమిళనాడు అడ్వకేట్‌ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది షణ్ముగసుందరం నియమితులయ్యారు. రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ అనేది ముఖ్యమైన పదవుల్లో ప్రధానమైనది. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన న్యాయ సలహాలను అడ్వకేట్‌ జనరల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అడ్వకేట్‌ జనరల్‌గా వ్యవహరించిన విజయనారాయణన్‌ ప్రభుత్వం మారగానే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డీఎంకేకు చెందిన షణ్ముగ సుందరంను ప్రభుత్వం నియమించింది.

ప్రొటెం స్పీకర్‌గా కే పిచ్చాండి 
కీళ్‌పొన్ను ఎమ్మెల్యే కే.పిచ్చాండిని అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ నియమించినట్లు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్‌భవన్‌లో పిచ్చాండితో గవర్నర్‌ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయిస్తారని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో పిచ్చాండి స్పీకర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణం చేయిస్తారని వెల్లడించారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు పిచ్చాండి పదవిలో కొనసాగుతారు.

మరిన్ని వార్తలు