‘స్వామి అగ్నివేశ్‌ మేక వన్నె పులి’

12 Sep, 2020 16:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్‌ పోలీసు అధికారి ఒకరు ఇంటర్నెట్‌ వేదికగా స్వామి అగ్నివేశ్‌ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ్నివేశ్‌‌పై ట్విట్టర్‌ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్వామి అగ్నివేశ్‌‌ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు నాగేశ్వర రావు. (చదవండి: దేవుళ్ల రథాలపై మరింత నిఘా..)

ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులతో పాటు డిపార్ట్‌మెంట్‌కు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమే కాక మానవ జీవితానికి సిగ్గు చేటు అన్నారు. ఇక పోలీస్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌ అయిన ఓ వ్యక్తి ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు’ అంటూ ట్వీట్‌ చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు