చపాతీ ఎఫెక్ట్‌.. చూపు కోల్పోయిన బాలుడు

3 Aug, 2021 17:28 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటన

రోజుకు 40 చపాతీలు.. 1206కు చేరిన షుగర్‌ లెవల్‌

తలలో చీము చేరి కంటి చూపు కోల్పోయిన బాలుడు

భోపాల్‌: ‘‘అతి సర్వత్రా వర్జయేత్‌’’ అన్నారు పెద్దలు... అంటే దేనిని అతిగా చేయడం మంచిది కాదని అర్థం. ముఖ్యంగా తిండి విషయంలో.. ఎంత రుచిగా ఉన్నా.. మన కడుపుకు సరిపోయేంతనే తినాలి తప్ప.. అతిగా లాగించకూడదు. కాదని బాగా తింటే.. ఎంతటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే అర్థం అవుతుంది. పన్నెండేళ్ల కుర్రాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే రోజుకు 40 చపాతీలు తినేవాడు. ఫలితంగా కంటి చూపు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వైద్యులు ఆ బాలుడికి సర్జరీ చేసి చూపు ప్రసాదించారు. ఆ వివరాలు.. 

మధ్యప్రదేశ్‌ శిప్‌పూరి జిల్లా ఖోడ్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్‌ కంటి చూపు క్రమంగా మందగించడం ప్రారంభం అయ్యింది. ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్‌ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం మానేశాయి. అతడు కేవలం ఊపిరి తీసుకోగల్గుతున్నాడు అంతే.

అక్కడ సందీప్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడి రిపోర్టులు చూసి షాక్‌ తిన్నారు. వైద్యులను అంతలా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే సందీప్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ ఏకంగా 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు గమనించారు. ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద మొత్తంలో షుగర్‌ లెవల్స్‌ ఉండటం ఏంటని ఆశ్చర్యపోయి.. అతడి ఆహారం గురించి ఆరా తీశారు. సందీప్‌ రోజుకు 40 చపాతీలు తినేవాడని అతడి తండ్రి తెలిపాడు.

ఇంత పెద్ద మొత్తంలో చపాతీలు తినడం వల్ల సందీప్‌లో షుగర్‌ లెవల్స్‌ పెరగడమే కాక మెదడులో చీము చేరింది. దాని వల్ల అతడు కంటి చూపు కోల్పోవడమే కాక.. శరీరంలోని మిగతా అవయవాల పని చేయడం మానేశాయి. ఈ క్రమంలో వైద్యులు సందీప్‌ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం ప్రతి రోజు సందీప్‌కు 6 యూనిట్ల ఇన్సులిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. 

షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థితికి వచ్చాక.. కంటి వైద్యుడు సందీప్‌ను పరీక్షించి.. ఆ బాలుడు డయాబెటిక్‌ రెటినోపతితో బాధపడుతున్నాడని తెలిపారు. వీలైనంత త్వరగా సందీప్‌కు సర్జరీ చేస్తే.. అతడికి కంటి చూపును తిరిగి తెప్పించవచ్చన్నారు. సందీప్‌ తల్లిదండ్రులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు సందీప్‌ చూడగల్గుతున్నాడు. ప్రస్తుతం సందీప్‌కు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు