నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్‌

26 Dec, 2020 14:47 IST|Sakshi

భోపాల్‌ : వివాదాస్పద లవ్‌ జిహాద్‌ బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదముద్ర వేసింది. బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని‌ మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లుకు కేబినెట్‌ఆమోదం తెలిపిన అనంతరం హోంమంత్రి నాథూరాం మిశ్రా వివరాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సమాజిక వర్గాలకు చెందిన యువతులను బలవంతంగా మతమార్పడి చేయించి వివాహం చేసుకుంటే పదేళ్లపాటు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయాల జరిమానా విధించే విధంగా బిల్లు రూపొందించామని తెలిపారు. అలాగే ఇతర వర్గాలకు చెందిన యువతను చట్ట విరుద్ధంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు  50 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. (‘లవ్‌ జిహాద్‌’ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు)

ఒకవేళ యువతీ, యువకులు ఇష్టపూరితంగా వివాహం చేసుకోవాలి అనుకుంటే మతమార్పడి కోసం రెండు నెలల ముందుగా జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ విధంగా చేయకుండా వివాహం చేసుకుంటే దానిని చట్ట విరుద్ధమైన వివాహం గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మధ్యప్రదేశ్‌ కంటే ముందుగా మతమార్పిడి వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యూపీ అనంతరం ఇలాంటి చట్టాన్ని రూపొందించిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిచింది. మరోవైపు ఇలాంటి చట్టాలను రూపొందించడటంపై దేశ వ్యాప్తంగా పలువర్గాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు