ఆ పట్టణం పేరు మారుస్తాం: సీఎం కీలక ప్రకటన

20 Feb, 2021 19:08 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ పట్టణం హోషంగాబాద్‌ పేరును మార్చనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ సిటీకి నర్మదాపురంగా నామకరణం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు పేర్కొన్నారు. నర్మద జయంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘హోషంగాబాద్‌ పేరు మార్చాలా, వద్దా?’’ అని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రశ్నించారు. ఇందుకు బదులుగా కచ్చితంగా మార్చాల్సిందే అంటూ సమాధానం రాగా. ఏ పేరు అయితే బాగుంటుందో సూచించాలంటూ ఆయన కోరారు. హోషింగాబాద్‌ను నర్మదాపురంగా వ్యవహరిస్తే బాగుంటుందంటూ ప్రజలు బదులిచ్చారు. 

ఇందుకు సరేనన్న ముఖ్యమంత్రి, నర్మదా నదిని కాపాడుకుందామని, నదీ తీరంలో సిమెంటు, కాంక్రీటు కట్టడాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా హోషంగాబాద్‌ పేరు మార్పు ప్రకటనపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రోటెం స్పీకర్‌ రామేశ్వర్‌ శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పటాకులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఇదొక చారిత్రాత్మక క్షణం. మధ్యప్రదేశ్‌కు నర్మదా నది జీవనాడి వంటిది. హోషింగ్‌ షా ఆక్రమణతో హోషింగాబాద్‌ అనే పేరు స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు తల్లి నర్మద పేరుతో పట్టణాన్ని పిలుచుకునే సమయం ఆసన్నమైంది. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. 

ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ సర్కారు ఇలాంటి ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మండిపడ్డారు. ‘‘మొఘల్‌ పాలకుల పేర్లతో ముడిపడిన పట్టణాల పేర్లను మాత్రమే బీజేపీ పాలకులు మారుస్తారు. బ్రిటీష్‌ రూలర్ల పేరుతో ఉన్న మింటో హాల్‌(విధాన సభ పాత భవనం) పేరు మాత్రం ఎందుకు మార్చడం లేదు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకు బదులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి’’అని హితవు పలికారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లు మార్పు!
ఉత్తరప్రదేశ్‌ ముఖ్య పట్టణం అలహాబాద్‌ పేరును ప్రయాగరాజ్‌గా,  ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గతంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎలాంటి చట్టబద్దమైన ఇబ్బందులు తలెత్తని పరిస్థితుల్లో గుజరాత్‌ పట్టణం అహ్మదాబాద్‌ పేరును కర్ణావతిగా మారుస్తామంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్ గతంలో ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వ వ్యవహార శైలిపై విమర్శలు ఎక్కుపెడుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
చదవండి సంతృప్తికర సమాధానాలు ఇవ్వండి: జడ్జి
లవ్‌ జిహాద్‌పై శ్రీధరన్‌ సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు