వైరల్‌: ‘కరోనా కాదు.. ఫ్యాన్‌ చంపేసేలా ఉంది’

27 Apr, 2021 14:21 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ ‍ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రమాదకరంగా మారిన సీలింగ్‌ ఫ్యాన్‌

వైరలవుతోన్న రోగుల అభ్యర్థన

భోపాల్‌: దేశంలో కోవిడ్‌ విజృంభణతో మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో.. దేశ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో మన ప్రభుత్వాలు ఎంత వెనకబడి ఉన్నాయో స్పష్టంగా అ‍ర్థం అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆస్పత్రుల్లో బెడ్ల కొరత.. ఆక్సిజన్‌ నిల్వలు నిండుకున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే వీటికి భిన్నమైన దృశ్యం ఒకటి మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సీలింగ్‌ ప్యాన్‌ కరోనా కన్న ఎక్కువగా రోగులను భయపెడుతుంది. దయచేసి.. ఈ ఫ్యాన్‌ను మార్చండి అంటూ రోగులు అభ్యర్థిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

ఆ వివరాలు.. మధ్యప్రదేశ్‌ చింద్వారా ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స పొందుతున్న ఓ రోగి వీడియోలో తమ ఫ్లోర్‌లో సీలింగ్‌కు వేలాడుతున్న ఫ్యాన్‌ను చూస్తే తనకు చాలా భయం వేస్తుందని.. అది ఎప్పుడు ఊడిపోయి ఎవరి నెత్తిన పడుతుందో అర్థం కాక ఫ్లోర్‌లో ఉన్నవారందరు భయంతో వణికిపోతున్నారని తెలిపాడు. అది ఎప్పుడు ఊడి కింద పడుతుందో అర్థం కాక రాత్రిళ్లు సరిగా నిద్ర కూడా పోవడం లేదని వివరించాడు. ‘‘దీన్ని రిపేర్‌ చేయడం లేదా.. దాని స్థానంలో కొత్తదాన్ని పెట్టమని ఆస్పత్రి సిబ్బందిని కోరాము.. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ వీడియో చూసి అయినా మా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నాడు. 

ఈ వీడియో చూసిన వారు ‘‘నిజమే కోవిడ్‌ కన్నా ఎక్కువ ఈ ఫ్యానే భయపెడుతుంది’’... ‘‘కరోనా కన్నా ముందే ఈ ఫ్యానే వారిని చంపేసేలా ఉంది’’.. ‘‘అది ఊడి కిందపడిపోయేలోపు నీవు కోలుకుని డిశ్చార్జ్‌ కావాలని ఆశిస్తున్నాను’’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: కరోనా: ‘బాలాజీని ప్రార్థించి, కొబ్బరికాయ కొట్టండి’ 

మరిన్ని వార్తలు