కన్నబిడ్డ పెళ్లి కోసం దాచిన సొమ్మును విరాళం..

27 Apr, 2021 13:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: కరోనా దేశవ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు ఎంతో మంది ఉపాధిని సైతం కోల్పోతున్నారు. ఈ దారుణమైన పరిస్థితుల్లో చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకుంటున్నారు. అయితే, ఒక రైతు మాత్రం తన కూతురు వివాహం కోసం దాచిన 2 లక్షల రూపాయల సొమ్మును ఆక్సిజన్‌ కొనుగొలు చేయడానికి జిల్లా కలెక్టర్‌కు విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాల్‌ దేవియన్‌ గ్రామానికి చెందిన చంపలాల్‌ గుర్జార్‌ అనే రైతు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూ.2 లక్షలను కూతురు పెళ్లి కోసం దాచాడు. కానీ కరోనా పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్‌ లేదని తెలిసి ఆలోచనలో పడ్డాడు. కన్నబిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బును జిల్లా కలెక్టర్‌ అగార్వాల్‌ గుల్జార్‌కు విరాళంగా ఇచ్చాడు. దీంతో కలెక్టర్‌ అతడిని అభినందించాడు. తండ్రి చేసిన పనికి కూతురు అనిత సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక ఈ విరాళంతో రెండు ఆక్సిజన్‌ సిలెండర్లను‌ కొనుగొలు చేశారు. కాగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఆదివారం నాటికి 4,99,304 యాక్టివ్‌ కేసులున్నాయి.

మరిన్ని వార్తలు