ఆరుగురు పాక్‌ వలసదారులకు భారత పౌరసత్వం

7 Jul, 2021 16:51 IST|Sakshi

భోపాల్‌: పాకిస్తాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌కి వచ్చిన ఆరుగురు పాక్‌ శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని అందించింది. వీరు మధ్యప్రదేశ్‌లో దశాబ్దాల కాలంగా జీవిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద భారత్‌ పౌరసత్వం కల్పించినట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్ర మాట్లాడుతూ.. ఈ ఆరుగురు వలస బాధితులు మతపరమైన హింసకు గురై భారత్‌లో బతకడానికి వచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం వారి భారత పౌరసత్వ పత్రాలను అధికారికంగా అందించినట్లు మంత్రి నరోత్తం మిశ్ర తెలిపారు.

పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్ భోపాల్ నివాసితులు కాగా, అర్జున్‌దాస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్య బాయి మాండ్‌సౌర్‌కు చెందినవారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు భారత దేశ పౌరసత్వం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. 31 ఏళ్లుగా తాను అటు పాకిస్తాన్‌, ఇటు భారత్‌కు చెందిన వాడని కాదనే భావన ఉండేది. కానీ, ప్రస్తుతం తాను భారతీయుడనని గర్వంగా ఉన్నట్లు అర్జున్‌దాస్ మంచందాని మీడియాతో తెలిపాడు.

పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్ నుంచి వీరు 1988-2005 సమయంలో భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వారికి పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం అందిచామని అధికారులు తెలిపారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్షీ, క్రైస్తవ వలసదారులకు భారత్‌ పౌరసత్వం కల్పించనుంది. అయితే 2014 సంవత్సరం కంటే ముందే భారత్‌కు వచ్చివారికి మాత్రమే  దేశ పౌరసత్వం కల్పించనుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు