సహజీవనాలతో పెరుగుతున్న లైంగిక నేరాలు

20 Apr, 2022 03:49 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు

ఇండోర్‌: సమాజంలో సహజీవనాల(లివ్‌ఇన్‌)తో లైంగిక నేరాలు, స్వైరత్వం పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్‌ హైకోర్టు అభిప్రాయపడింది. ఒక యువతిపై అత్యాచారం చేసాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 25ఏళ్ల యువకుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లివ్‌ ఇన్‌ల కారణంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇలాంటి నేరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సివస్తోందని తెలిపింది. అధికరణం 21 కల్పించిన హక్కులనుంచి ఉద్భవించిన సహజీవన సంస్కృతి భారతీయ సమాజ నైతికనియమాలను కబళిస్తోందని, కామవికారాలను ప్రోత్సహిస్తోందని, అంతిమంగా లైంగిక దాడుల పెరుగుదలకు కారణమవుతోందని విమర్శించింది.

అధికరణం 21 జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తుంది. దీని పరిధిని న్యాయస్థానాలు కాలక్రమంలో పలు అంశాలకు విస్తరిస్తూ వచ్చాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేయాలనుకునేవాళ్లకు ఈ హక్కుకున్న పరిధి గురించిన ఆలోచన ఉండదని, సహజీవనంలోని భాగస్వాములకు ఈ హక్కు వర్తించదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో ఫిర్యాది, ఫిర్యాదిదారు సహజీవనం చేసేవారు. సదరు యువతి అంతకుముందు రెండు సార్లు యువకుడి బలవంతంతో గర్భస్రావం చేయించుకుంది. అనంతరం ఆ యువతి సహజీవనానికి స్వస్తి పలికి వేరేవారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఆ యువకుడు దీన్ని సహించలేక ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయనారంభించాడు. తామిద్దరం కలిసిఉన్న వీడియోలను కాబోయే పెళ్లి కొడుకుకు పంపాడు. తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటే చస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పెళ్లి రద్దయింది. దీనికి ఆగ్రహించిన యువతి ఆ వ్యక్తిపై కేసు పెట్టింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం యువకుడు చేసుకున్న అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది.    

మరిన్ని వార్తలు