ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్‌గా నిలిచింది

5 Aug, 2021 15:50 IST|Sakshi
తల్లిదండ్రుల ఫోటోతో సీబీఎస్‌ పదో తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన వనీషా పఠాక్‌

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన మధ్యప్రదేశ్‌ విద్యార్థిని

రెండు నెలల ముందే కోవిడ్‌తో తల్లిదండ్రులిద్దరు మృతి

సాక్షి, వెబ్‌డెస్క్‌: పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయరు. ప్రతీది వారి ముందుకే తెచ్చిపెడతారు. ఏమంటే.. పిల్లలు ఏ మాత్రం డిస్టర్బ్‌ అయినా ఆ ప్రభావం వారి పరీక్షల మీద పడుతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు.

అలాంటిది పరీక్షల ముందు ఏకంగా అమ్మానాన్న మరణిస్తే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. పరీక్షల్లో పాసవ్వడం సంగతి అటుంచి.. అసలు చాలా మంది ఎగ్జామ్స్‌కు హాజరవ్వరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే విద్యార్థిని అందుకు భిన్నం. తల్లిదండ్రులను కోల్పోయాననే బాధ వెంటాడుతున్నప్పటికి.. వారు తనమీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడమే తన బాధ్యత అనుకుంది. మరింత దీక్షగా చదివి.. టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని స్టోరి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. 

ఆ వివరాలు.. బుధవారం ప్రకటించిన సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలోల మధ్యప్రదేశ్‌కు చెందిన వనీషా పఠాక్‌ టాపర్‌గా నిలిచింది. స్కూల్‌ యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నప్పటికి.. పెద్దగా సంతోషించలేకపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో తన పక్కనే ఉండి.. తన విజయంలో పాలు పంచుకుని.. తన కన్నా ఎక్కువగా మురిసిపోవాల్సిన తన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కోవిడ్‌ బారిన పడి మృతి చెందారు. ఫస్ట్‌ వచ్చిన సంతోషం కంటే.. అమ్మనాన్న లేరనే విషయమే వనీషాను ఎక్కువ బాధిస్తుంది. 

                                               తల్లిదండ్రులతో వనీషా పఠాక్‌ (ఫైల్‌ ఫోటో)

ఈ సదర్భంగా వనీషా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోతాహిస్తూ ఉండేవాళ్లు. జీవితాంతం నన్ను పోత్సాహిస్తూనే ఉంటారు. నా పరీక్షల ముందే వారిద్దరికి కోవిడ్‌ సోకి ఆస్పత్రిలో చేరారు. నేను చివరి సారిగా ఈ ఏడాది మే 2న మా అమ్మతో మాట్లాడాను. మే 4న ఆమె చనిపోయారు. అప్పటికే మా నాన్న కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. కానీ మా బంధువులు నాకు ఆ విషయం చెప్పలేదు. మే 10న నాన్నతో చివరి సారి మాట్లాడాను. ఐదు రోజుల తర్వాత నాన్న కూడా చనిపోయారు. ఆ తర్వాతే నాకు అమ్మనాన్న చనిపోయారనే విషయం చెప్పారు. అమ్మ మృతదేహాన్ని కూడా చూడలేకపోయాను. ‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో.. ధైర్యంగా ఉండి.. మేం త్వరలోనే వస్తాం’’ ఇదే అమ్మ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యింది వనీషా.

ఆ తర్వాత తేరుకుని ‘‘ఇప్పుడు నా జీవితంలో నాకున్న అతిపెద్ద అండ నా సోదరుడు. తను ఇచ్చిన మద్దతు వల్లే నేను అమ్మనాన్న చనిపోయారనే బాధ నుంచి కోలుకుని.. చదువు మీద దృష్టి పెట్టగలిగాను. ఈ రోజు టాపర్‌గా నిలిచాను. నాన్న కలల్ని నేరవేరుస్తాను. అమ్మ కోరుకున్నట్లు నేను ధైర్యంగా ఉంటాను’’ అని తెలిపింది వనీషా. ఇక ఎన్‌డీటీవీ తెలిపిన వివరాల ప్రకారం వనీషా తండ్రి జితేంద్ర కుమార్‌ ఆర్థిక సలహాదారుగా పని చేసేవాడు.. ఆమె తల్లి డాక్టర్‌ సీమా పఠాక్‌ స్కూల్‌ టీచర్‌గా పని చేసేవారు.


 

మరిన్ని వార్తలు