వాట్ ఎన్ ఐడియా.. బైక్‌ను అంబులెన్స్‌గా మార్చిన వెల్డర్‌..

30 Apr, 2021 16:02 IST|Sakshi

భోపాల్‌ : అంబులెన్స్‌ లేక తన ద్విచక్రవాహనంపై కరోనా బాధితుల్ని తరలిస్తున్నారంట. 3 కిలోమీటర్ల ప్రయాణానికి ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ రూ.10 వేలు ఛార్జ్‌ చేస్తున్నాడంట. ఇలాంటి వార్తల్ని మనం పేపర్లలో చదివి, టీవీల్లో చూసినప్పుడు కరోనా కష్టకాలంలో బాధితులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఈ దోపిడీ ఏంటని తిట్టుకునే ఉంటాం. కానీ, ఓ వెల్డర్‌ మాత్రం అలా చేయలేదు. మనసుంటే సేవ చేయటానికి మార్గం ఉంటుందని నిరూపిస్తూ సదరు వెల్డర్‌ కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చేశాడు. 

వివరాలు.. మధ్యప్రదేశ్‌ ధార్‌కు చెందిన ఓ వెల్డర్‌కు పేపర్లలో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో వార్తలు చదివే అలవాటుంది. ఎప్పటిలాగే ఫేస్‌ బుక్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్ కరోనా బాధితుల నుంచి  కేవలం 3 కిలోమీటర్లకు రూ.10వేలు వసూలు చేస్తున్నాడనే వార్త ఆయన్ను కదిలించింది. అంతే అంబులెన్స్‌లు లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల్ని ఎలాగైనా అదుకోవాలని అనుకున్నాడు. అలా అనుకున్నదే తడువుగా వెల్డింగ్‌ పనిచేసే ఆయనకు ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఇప్పుడు సూపర్‌ హిట్‌ అయ్యి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

స్క్రాప్‌తో 20 నుంచి 25వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓ మినీ అంబులెన్స్‌ను తయారు చేశాడు. ఆక్సిజన్‌ సిలిండర్‌తో పాటు కరోనా బాధితులకు మెడిసిన్‌ అందించేలా సెటప్‌ చేశాడు. కరోనా బాధితుడితో పాటూ మరో ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌ కూర్చునేలా డిజైన్‌ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా అంబులెన్స్‌ తయారు చేసిన వ్యక‍్తి మాట్లాడుతూ.. కరోనా వల్ల సామాన్యులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లో కిలోమీటర్‌ దూరానికే వేలల్లో వసూలు చేయడం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే కరోనా బాధితులకోసం స్క్రాప్‌ను ఉపయోగించి అంబులెన్స్‌ను తయారు చేశా. లాక్‌ డౌన్‌ వల్ల స్క్రాప్‌తోనే అంబులెన్స్‌ను డిజైన్‌ చేయించాల్సి వచ్చిందని అన్నాడు. ఏదేమైనా, పేద ప్రజలకు సకాలంలో ట్రీట్‌మెంట్‌ అందించేలా ఇలాంటి అంబులెన్స్‌లను తయారు చేస్తే బాగుంటుందని అంటున్నాడు. 

మరిన్ని వార్తలు