Madhya Pradesh: ‘శ్రీరామ నవమి’ అల్లర్ల కేసులో ట్విస్ట్‌.. ఖైదీలపై కొత్త కేసు!

15 Apr, 2022 16:36 IST|Sakshi
మధ్యప్రదేశ్‌ పోలీసుల భద్రత (ఫైల్‌ ఫొటో)

శ్రీ రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి మధ్యప్రదేశ్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్‌ వెలుగు చూసింది. పోలీసులు మత ఘర్షణల పేరిట ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. వాళ్లు ఘర్షణల కంటే నెల ముందు నుంచే జైళ్లో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది.

హత్యాయత్నం పేరిట దాఖలైన ఓ కేసులో ఆ ముగ్గురు.. మార్చి 5వ తేదీ నుంచి జైల్లోనే ఉన్నారన్న విషయం ఎఫ్‌ఐఆర్‌ కాపీ బయటకు రావడంతో వెలుగు చూసింది. ఆల్రెడీ జైల్లో ఉన్న ఈ ముగ్గురిపై విచిత్రంగా.. ఏప్రిల్‌ 10న బార్వాని జిల్లా సెంద్వా దగ్గర చోటుచేసుకున్న అల్లర్లలో ఓ మోటర్‌ బైక్‌ను తగలబెట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకో కొసమెరుపు ఏంటంటే.. హత్యాయత్నం కేసు నమోదు అయిన పోలీస్‌ స్టేషన్‌లోనే.. ఇప్పుడు ఈ మతఘర్షణల కేసు కూడా ఫైల్‌ కావడం. 

దీని గురించి ఉన్నతాధికారుల్ని మీడియా ఆరా తీయగా.. ఫిర్యాదుదారుని(వివరాలు వెల్లడించలేదు) ఆరోపణల మేరకు కేసు నమోదు చేశామని, దీనిపై విచారణ చేపట్టి జైలు సూపరింటెండెంట్‌ నుంచి సమాచారం తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని  తెలిపారు. 

ఇదిలా ఉండగా.. ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా.. ఉరేగింపులపై ఖార్‌గాన్‌, బర్వానీ జిల్లాల్లో రెండు చోట్ల రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో 24 మంది, ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయించాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. 

దీంతో అధికారులు 16 ఇళ్లు, 29 దుకాణాలను కూల్చేశారు. ఇక సెంద్వాలో  బైక్‌ను తగలబెట్టారన్న ఆరోపణలపై షాబాజ్‌, ఫక్రూ, రౌఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ముగ్గురిలో ఒకడైన షాబాజ్‌ ఇంటిని అక్రమ కట్టడంగా ఆరోపిస్తూ అధికారులు దగ్గురుండి బుల్డోజర్‌లతో కూల్చేయించారు కూడా. ఆ సమయంలో షాబాజ్‌ తల్లి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేయడంపై చేతులెత్తి వేడుకుంది.. తమ కొడుకు అప్పటికే జైల్‌లో ఉన్నాడని అధికారులకు చెప్పింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది కూడా.

సంబంధిత వార్త: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి అసదుద్దీన్‌ సవాల్‌ 

మరిన్ని వార్తలు