Viral Video: గాడిదపై సర్పంచ్‌ ఊరేగింపు: పండగ చేసుకున్న గ్రామస్తులు

23 Jul, 2021 19:06 IST|Sakshi

భోపాల్‌: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా మధ్యప్రదేశ్‌లో మాత్రం ఆశించినంతగా కురవడం లేదు. దీంతో వర్షాల కోసం ప్రజలు తీరొక్క తీరున పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మనం కప్పల పెళ్లి తదితర కార్యక్రమాలు చూశాం. కానీ ఆ రాష్ట్రంలో వింతగా గాడిదపై సర్పంచ్‌ కూర్చొని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఉత్సాహంతో ఈలలు.. కేకలు వేస్తూ డప్పు చప్పుళ్లకు డ్యాన్స్‌ చేస్తూ వర్షం కోసం ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

ఆ రాష్ట్రంలోని విదిశ జిల్లా రంగై గ్రామంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతోంది. వర్షాల కోసం గాడిదపై సర్పంచ్‌ గ్రామమంతా ఊరేగాలనే సంప్రదాయం ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవడం లేదు. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి సర్పంచ్‌ సుశీల్‌ వర్మకు గత సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనుకున్నదే తడువుగా ఒక గాడిదను తీసుకుని వచ్చి దానికి పూజించారు. అనంతరం సర్పంచ్‌ సుశీల్‌ వర్మ గాడిదపై కూర్చోగా గ్రామస్తులంతా కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. పటేల్‌ బాబా ఆలయం నుంచి గణేశ్‌ మందిరం వరకు ఊరేగింపు చేపట్టారు. ఈలలు.. కేకలు వేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో గ్రామస్తులు పాల్గొన్నారు. 

ఊరేగింపు ముగిసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ప్రార్థించారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్‌ సుశీల్‌ వర్మ స్పందించి ఆ ఆనవాయితీ గురించి వివరించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో మాకు వింత ఆచారం ఉంది. గ్రామ అధిపతి (సర్పంచ్‌) గాడిదపై స్వారీ చేస్తే వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే గాడిదపై స్వారీ చేశా. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సమస్య పరిష్కరించడం నా బాధ్యత. అందుకే గాడిదపై ఊరేగి వరుణదేవుడిని ప్రార్థించా’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు