Covid Vaccine: నాట్లేసిన ఉపాధ్యాయులు.. రైతులను అక్కడికి పంపి

10 Aug, 2021 11:20 IST|Sakshi
పొలంలో నాట్లు వేస్తున్న టీచర్లు(ఫొటో: టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా)

భోపాల్‌: మహమ్మారి కరోనా ఇంకా అంతం కాలేదు. రూపాలు మార్చుకుంటూ రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే కోవిడ్‌ నాలుగో వేవ్‌ మొదలు కాగా.. భారత్‌లోనూ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో పాటు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, కొన్నిచోట్ల అవసరానికి తగ్గట్లుగా డోసులు అందుబాటులో లేకపోగా, మరికొన్ని చోట్ల టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ టీచర్లు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. వ్యాక్సినేషన్‌ సజావుగా సాగేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించి.. పొలాల్లో దిగి రైతుల్లా అవతారమెత్తిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

అసలు విషయం ఏమిటంటే.. ఆగష్టు 7న, జబల్‌పూర్‌ సమీప గ్రామమైన మానిక్‌పూర్‌లోని వ్యాక్సినేషన్‌ బూత్‌కు వెళ్లిన ఉపాధ్యాయులకు ఖాళీ కేంద్రం దర్శనమిచ్చింది. రికార్డులను పరిశీలించగా.. ఆరోజు 33 మంది గ్రామస్తులు రెండో డోసు వేయించుకోవాల్సి ఉంది. కానీ, ఒక్కరు కూడా వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు రాలేదు. దీంతో విషయమేంటని ఆరా తీయగా.. వారంతా పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో.. అక్కడికి చేరుకున్న టీచర్లు..వారిని టీకా రెండో డోసు వేయించుకోవాల్సిందిగా కోరారు. అయితే, సీజన్‌ ఉన్నపుడే పనులు పూర్తిచేసుకోవాలని, లేదంటే పంట నష్టపోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే వ్యాక్సిన్‌ వేసుకుంటామని రైతులు తేల్చిచెప్పారు. 

ఈ విషయమై ఇరువర్గాల మధ్య కాసేపు సంభాషణ నడిచింది. ఈ క్రమంలో తాము కూడా గ్రామాల నుంచే వచ్చామని, పొలం పనుల్లో సాయం చేస్తామంటూ టీచర్లు ముందుకు వచ్చారు. అందుకు బదులుగా.. రైతులను వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లాల్సిందిగా కోరారు. మొదట కాస్త తటపటాయించినప్పటికీ.. ఉపాధ్యాయుల చొరవ చూసి.. ఆ 33 మంది రైతులు వ్యాక్సిన్‌ బూత్‌కు వెళ్లి రెండో డోసు వేయించుకున్నారు. ఇక ఈ విషయం గురించి ముఖ్య వైద్యాధికారి రమేశ్‌ మరావి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం టీచర్లు పొలంలోకి దిగి పనిచేయడం, వ్యాక్సినేషన్‌ సజావుగా సాగేలా చూడటం అభినందనీయమన్నారు.

మరిన్ని వార్తలు