ఉమెన్స్‌ డే: ఆమె కానిస్టేబుల్‌ కాదు.. హోం మంత్రి!

9 Mar, 2021 13:43 IST|Sakshi

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం రోజున ఓ మ‌హిళా కానిస్టేబుల్‌ అరుదైన గౌర‌వాన్ని అందుకున్నారు. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో మీనాక్షి వర్మ అనే కానిస్టేబుల్‌కు ఒకరోజు హోంమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మీనాక్షిని మంత్రి మిశ్రా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న చైర్‌ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వ‌ర్మ‌కు ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ ఒక్కరోజు(సోమవారం) హోంశాఖ పూర్తిగా మీనాక్షి ఆదేశాల మేరకే పని చేస్తుందని పేర్కొన్నారు.

అనంతరం సమస్యలు తెలపటానికి వచ్చిన ప్రజల నుంచి మీనాక్షీ వర్మ పలు వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజా సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు అక్కడ మంత్రి కూర్చునే స్థానంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. మహిళా దినోత్సవం రోజున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని మీనాక్షి అన్నారు. తాను హోంమంత్రిగా పనిచేసే అవకాశం తనకు దక్కుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మీనాక్షి హోమంత్రి కార్యాలయంలోనే సెక్యూరిటీ విధుల్లో ఉంటున్నారు.

చదవండి: 

రాజస్తాన్‌ కమలంలో వర్గపోరు ! 

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు