కోవిషీల్డ్‌ సేఫ్‌ కాదు: కేంద్రానికి హైకోర్టు నోటీసులు

19 Feb, 2021 20:46 IST|Sakshi
మద్రాస్‌ హై కోర్టు (ఫైల్‌ఫోటో)

కోవిషీల్డ్‌ టీకా మీద నమోదైన ఫిర్యాదుపై మద్రాస్‌ హై కోర్టు విచారణ

చెన్నై: సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల తన సృజనాత్మకత దెబ్బతిన్నదని.. ఈ వ్యాక్సిన్‌ని సురక్షితం కాదని ప్రకటించండి అంటూ చెన్నైకి చెందిన ఓ వలంటీర్‌ గతేడాది డిసెంబర్‌లో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీరం.. సదరు వలంటీర్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని ఖండించింది. అతడిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మద్రాస్‌ హై కోర్టు ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి నోటీసులు జారీ చేసింది. 2021, మార్చి 26 వరకు దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా హై కోర్టు ఆదేశించింది.

కేసు వివరాలు.. 
చెన్నైకి చెందిన అసిఫ్‌ రియాజ్(41)‌ అనే వలంటీర్‌ గతేడాది అక్టోబర్‌ 1న సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. ఓ పది రోజలు తర్వాత అతడికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వెల్లడించాడు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని వైద్య పరీక్షలో స్పష్టమైందన్నాడు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నాడు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నాడు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.

ఇప్పడేమంటున్నాడు..
కోర్టు తీర్పు అనంతరం అసిఫ్‌ రియాజ్‌ మాట్లాడుతూ.. "నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను తీసుకున్న (కోవిషీల్డ్) వ్యాక్సిన్ వల్లనే నాకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు వెల్లడించారు. దీని గురించి ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఇక కోర్టును ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఈ కేసులోని వాస్తవాల ఆధారంగా కోర్టు దీన్ని విచారిస్తుందని నేను ఆశిస్తున్నాను. టీకా కారణంగా నేను బాధపడ్డానని నన్ను పరీక్షించిన వైద్య నిపుణలు వెల్లడించారు. నాకు న్యాయం జరగుతుందని నేను భావిస్తున్నాను’’ అన్నాడు. 

చదవండి: వ్యాక్సిన్‌పై వార్‌.. 100 కోట్లకు దావా!
                   వ్యాక్సిన్‌: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’

మరిన్ని వార్తలు