బిగ్‌ రిలీఫ్‌: పన్నీర్‌ సెల్వంకు ఊరట.. మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

17 Aug, 2022 13:43 IST|Sakshi

చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్‌ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్‌ కో విధించింది మద్రాస్‌ హైకోర్టు. జూన్‌ 23న జనరల్‌ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్‌ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. 

అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్‌ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్‌ 23న నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్‌ సెక్రెటరీగా ఈపీఎస్‌ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్‌ తరఫు న్యాయవాది తమిల్‌మారన్‌. 

గతంలో ఓపీఎస్‌ను పార్టీ టాప్‌ పోస్ట్‌కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్‌ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్‌తో చేతులు కలిపిన ఈపీఎస్‌ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్‌ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్‌. ఓపీఎస్‌ కోఆర్డినేటర్‌గా, ఈపీఎస్‌ డిప్యూటీ జాయింట్‌ కోఆర్డినేటర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్‌. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు.  అయితే, తాజాగా మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్‌కు ఊరట లభించినట్లయింది.

ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్‌ ఉత్కంఠ

మరిన్ని వార్తలు