కరగాట్టంలో అశ్లీలత ఉండకూడదు: హైకోర్టు ఆంక్షలు

6 Nov, 2022 12:39 IST|Sakshi

సాక్షి, చెన్నై: కరగాట్టంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. తమిళ సంప్రదాయ నృత్యాల్లో ప్రముఖమైనది కరగాట్టం. మదురై జిల్లా మేలపట్టి గ్రామానికి చెందిన మారిచ్చామి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో తమ గ్రామంలో మారియమ్మన్‌ ఆలయంలో ఈనెల 8న ఉత్సవాలు నిర్వహించడానికి నిశ్చయించామన్నారు. ఈ సందర్భంగా కరగాట్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను కోరామన్నారు.

పోలీసులు భద్రత ఇవ్వడానికి ముందుకు రావడం లేదని, సంప్రదాయ కళల్లో  ప్రధాన మైన కరగాట్టం అంతరించి పోకుండా ఉండేందుకే ఈ వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి సుకుమార కురూప్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆలయ ఉత్సవాలలో కరగాట్టం నిర్వహించడంపై కొన్ని నిబంధనలను న్యాయమూర్తి తెలియజేశారు.

ఈ రకం నృత్యాలు చేసే సమయంలో అసభ్యకరమైన దుస్తులు, ద్వంద్వ అర్థాల మాటలు, అనాగరిక ప్రవర్తన ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   
చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..

మరిన్ని వార్తలు