Dussehra Celebrations: దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

15 Sep, 2022 07:30 IST|Sakshi

సాక్షి, చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ బుధవారం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దసర ఉత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో రోజూ నృత్య ప్రదర్శనలు, సినిమా డాన్సులు, పాటలు హోరెత్తుతాయి. వీటిలో అశ్లీలం శృతి మించడం పరిపాటిగా మారింది. పైగా కొన్నిచోట్ల సినీ తారలను సైతం ఆహా్వనించి వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తుంటారు. 

కులశేఖర పట్నంలో.. 
తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడి ముత్తాలమ్మన్‌ ఆలయంలో తొమ్మిది రోజులు వేడుకలు మిన్నంటుతాయి. ఇక్కడ కూడా సీనీ గీతాలు, డాన్సులకు కొదవ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాంకుమార్‌ ఆదిత్యన్‌ అనే సామాజిక కార్యకర్త దసరా ఉత్సవాల పేరిట సాగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. 

బుధవారం న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్‌ బెంచ్‌ ముందుకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఎంతో భక్తితో వ్రతాలు, నోములు తదితర పూజాది కార్యక్రమాలను భక్తులు ఈ దసరా సందర్భంగా అనుసరిస్తారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇలాంటి సందర్భంలో అశ్లీల కార్యక్రమాల వల్ల భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు దసరా ఉత్సవాల్లోనే కాకుండా, ఏ ఆలయ వేడుకల్లోనూ ఇకపై అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కులశేఖర పట్నంలో నిర్వహించే వేడుకలను తూత్తుకుడి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు