Muniyandi Temple: అక్కడి బిర్యాని తింటే.. కోరికలు నెరవేరుతాయి, పోటేత్తిన జనం!

29 Jan, 2023 09:10 IST|Sakshi

మునియాండి ఆలయ ఉత్సవాల్లో వింత ఆచారం

మదురై సమీపంలో పోటెత్తిన జనం

సాక్షి, చెన్నై: మునియాండి ఆలయ ఉత్సవాల్లో భాగంగా మదురై సమీపంలోని వడకం పట్టిలో శనివారం 50 గ్రామాల ప్రజలకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. ఈ బిర్యాని (ప్రసాదం) తింటే ఎలాంటి కోరికలైనా త్వరితగతిన తీరుతాయని ఇక్కడి భక్తులు భావిస్తుంటారు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగలం సమీపంలో కల్లికుడి వడకంపట్టి గ్రామం ఉంది. ఇక్కడ కొలువై ఉన్న మునియాండి స్వామిని తమ కులదైవంగా రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు భావిస్తుంటాయి.

రాష్ట్రంలో మునియాండి విలాస్‌ పేరిట హోటళ్లు నడుపుతున్న వాళ్లందరికీ ఇక్కడి మునీశ్వరరే కులదైవం. ఏటా ఇక్కడ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించ లేదు. ఈ ఏడాది భారీ స్థాయిలో ఈ ఉత్సవాలను (వారం రోజులుగా) నిర్వహిస్తున్నారు. ఇక శనివారం బిర్యాని విందు అట్టహాసంగా సాగింది.

బారులుదీరిన జనం.. 
ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అభిషేకం కోసం పాల బిందెలతో ఊరేగింపు చేపట్టారు. అతిపెద్ద కత్తులను ఆలయానికి సమర్పించారు. తర్వాత 50 గ్రామాలకు చెందిన భక్తులకు బిర్యాని విందు ఏర్పాటు చేశారు. 74 మేకలను, 200కు పైగా కోళ్లు, 2,500 కేజీల బియ్యంతో బిర్యాని తయారు చేసి, అందరికీ పంచి పెట్టారు. ఇక్కడి బిర్యాని కోసం జనం ఎగబడ్డారు. ఈ బిర్యాని తింటే పెళ్లి కాని వారికి పెళ్లిలు అవుతాయని, బిడ్డలు లేని వారికి పిల్లల భాగ్యం కలుగుతుందని, ఇతర కోరికలన్నీ నెర వేరుతాయని భక్తులు వెల్లడించారు.

ఈ ఆలయంలోని స్వామి వారి పేరిట రాష్ట్రవ్యాప్తంగా మునియాండి విలాస్‌లను నడుపుతున్నామని, రోజూ తమ హోటల్‌లో తొలి బిల్లు రూపంలో వచ్చే మొత్తా న్ని ఆలయం కోసం తాము కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు కుల దైవం అని, ఇక్కడికి వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఆలయం వద్దే బంధురికం కలుపుకోవడం విశేషం. అలా బంధువుల్లోని యువతి, యువకులను ఎంపిక చేసి వివాహాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: తమిళనాడులో విషాదం.. ఆలయ ఉత్సవాల్లో కుప్పకూలిన క్రేన్‌.. నలుగురి మృతి

మరిన్ని వార్తలు