వైరలవుతోన్న బిస్కెట్‌‌ కప్‌ ఐడియా

12 Dec, 2020 09:31 IST|Sakshi

చెన్నై: చాయ్‌ విత్‌ బిస్కెట్స్‌‌.. ఎవర్‌గ్రీన్‌ కాంబినేషన్‌. మనలో చాలా మంది ఉదయం చాయ్‌-బిస్కెట్‌తోనే ప్రారంభమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్‌ తాగేటప్పుడు కూడా బిస్కెట్‌ తినడం చాలా మందికి అలవాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మధురై టీ కొట్టు యాజమాని ఓ వెరైటీ కాంబినేషన్‌ని తీసుకొచ్చారు. సాధారణంగా టీని గాజు గ్లాస్‌, కాగితపు కప్పు, పింగాణి కప్పులో పోస్తారని తెలుసు. అయితే ఈ టీ కొట్టు యాజమాని మాత్రం వెరైటీగా బిస్కెట్‌ టీ కప్పులు తీసుకొచ్చాడు. అంటే బిస్కట్స్‌తో తయారు చేసిన కప్పులు అన్నమాట. మధురైలోని ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్‌తో తయారు చేసిన తినే కప్పుల్లో తక్కువ మొత్తంలో టీని అందిస్తోంది. అంటే మీరు మీ టీని తాగవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. దీని వల్ల వ్యర్థాలు ఉండవు.. మనకు భిన్నమైన అనుభూతి. 

ది బెటర్ ఇండియా వీడియో రిపోర్ట్ ప్రకారం ఆర్‌ఎస్‌ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుంచి ఉంది. అక్టోబర్ 2019 లో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నెమ్మదిగా తొలగించి 2022 నాటికి పూర్తిగా నిషేధించాలని భారత్ యోచిస్తోంది. వీటిలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు వంటి రోజువారీ వినియోగ వస్తువులు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో టీ స్టాల్ యజమాని వివేక్ సబాపతికి వినూత్న ఆలోచన వచ్చింది. పర్యావరణ అనుకూలమైన టీ కప్పులు కోసం శోధిస్తున్నప్పుడు బిస్కెట్ కప్పులపై సబపతి దృష్టి పడింది. అలా దాన్ని అమల్లోకి తెచ్చారు. (చదవండి: నోట్లో ‘కుకీసు’కుందాం)

ఇక ఈ తినదగిన బిస్కెట్ టీ కప్పు ధర 20 రూపాయలు మాత్రమే. ఈ వినూత్న ప్రయోగం టీ ప్రియులకు కూడా బాగా నచ్చింది.  జూలై నెలలో ప్రారంభించినప్పటి నుంచి జనాలు బిస్కెట్‌ కప్పులో అందించే టీని తాగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కప్‌లో సుమారు 60 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అయితే ఈ బిస్కెట్‌ కప్పులో పోసిన టీని పది నిమిషాల్లోనే తాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కప్పు మెత్తగా అయ్యి చిరిగిపోతుంది. ఇక ఈ బిస్కెట్‌ కప్పులో మరిన్ని ఫ్లేవర్స్‌ తీసుకురావాలని భావిస్తున్నారు సభాపతి. ఒక్కసారి పరిస్థితులు చక్కబడితే దానిపై దృష్టి పెడతామని తెలిపారు. 

మరిన్ని వార్తలు