పనులకు రాలేదని.. గర్భవతిపై దాడి

30 May, 2021 10:15 IST|Sakshi

మధ్యప్రదేశ్​లో దాష్టీకం చోటు చేసుకుంది. పిలిస్తే పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడి చేసి మూడు రోజులపాటు బంధించారు. గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళను కిరాతకంగా హింసించారు. ఈ ఘటన అక్కడి సోషల్ మీడియాను కుదిపేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. 

భోపాల్​: మధ్యప్రదేశ్​ ఛాతర్​పూర్ జిల్లా బండార్​ఘడ్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గర్భంతో ఉన్న మహిళపై రాడ్లతో దాడి చేశారు. ఆపై మూడు రోజులు ఇంట్లోనే బంధించారు. ఆలస్యంగా ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.  ​    
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో స్వర్ణ కులానికి చెందిన ఓ వ్యక్తి, బాధిత కుటుంబాన్ని పోలం పనులకు రావాలని పిలిచాడు. అయితే వేరే పనులు ఉండడంతో తర్వాత వస్తామని వాళ్లు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి కొందరిని వెంటేసుకుని ఆ ఇంటికి వెళ్లాడు. బాధిత మహిళను, ఆమె అత్తను కులం పేరుతో దూషిస్తూ.. దాడికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో మగవాళ్లను చంపుతామని బెదిరించాడు. మూడు రోజులపాటు ఇంట్లోనే బంధించి.. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. అయితే కొందరు యువకుల సాయంతో విషయం పోలీసులకు చేరడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు ఇచ్చిన స్టేట్​మెంట్​తో నిందితుల కోసం గాలిస్తున్నామని రాజ్​నగర్ పోలీస్​ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ పంకజ్ శర్మ తెలిపారు.

అత్యాచారం?
కాగా, ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందని దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నాయి. ఐదు రోజులు ఆ కుటుంబం నరకం అనుభవించిందని, పిల్లల కళ్లెదుటే ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించకపోగా.. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు.

మరిన్ని వార్తలు