కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్ 

13 Aug, 2020 12:39 IST|Sakshi

రామమందిర భూమిపూజలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్

ఆందోళనలో అధికారులు 

ఇదే వేదికపై ప్రధాని మోదీ తదితరులు 

మధుర: రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా,  గురువారం కోవిడ్-19 నిర్ధారణ అయింది. కృష్ణ జన్మాష్టమి వేడుకల నిమిత్తం మధుర వెళ్లిన ప్రస్తుతం ఆయనకు ఆగ్రా  చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహంత్ ను మెరుగైన చికిత్స కోసం గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించనున్నామని మధుర జిల్లా మేజిస్ట్రేట్ రామ్ మిశ్రా వెల్లడించారు.

గతవారం (ఆగస్టు 5న) ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వేదికను పంచుకున్న ఈయన తాజాగా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన రేపింది. ఇదే వేదికపై యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఉండటం గమనార్హం. కాగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు కొన్ని రోజుల ముందు, పూజారి ప్రదీప్ దాస్ సహా మరో 14 మంది పోలీసులకుకూడా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు