పాక్‌లో రాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం ధ్వంసం

18 Aug, 2021 04:29 IST|Sakshi
టీఎల్‌పీ కార్యకర్త ధ్వంసం చేసిన మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహం

ఖండించిన భారత విదేశాంగ శాఖ

లాహోర్‌: సిక్కు వర్గానికి చెందిన మహారాజా రంజిత్‌ సింగ్‌ కంచు విగ్రహాన్ని తెహ్రీక్‌ ఈ లబ్బైక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ) కార్యకర్త ధ్వంసం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సుకు చెందిన లాహోర్‌ ఫోర్ట్‌ వద్ద ఈ విగ్రహం ఉంది. పలు నినాదాలు చేస్తూ, విగ్రహాన్ని ఓ వైపు నుంచి కూల్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం మరో వ్యక్తి వెళ్లి విగ్రహపు చేతిని ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. 2019లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు ఉంటుంది. సిక్కు సంప్రదాయ రూపంతో కత్తి పట్టుకొని గుర్రం మీద మహారాజ రంజిత్‌ సింగ్‌ కూర్చొని ఉంటారు.

దీనిపై పాక్‌ ప్రభుత్వం స్పందించింది. సమాచార మంత్రి ఫవాద్‌ చౌధరి మాట్లాడుతూ.. ఇలాంటి నిరక్షరాస్యుల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ సలహాదారు షబ్నాజ్‌ గిల్‌ మాట్లాడుతూ, నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిందితున్ని ఇప్పటికే పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై భారత్‌ స్పందించింది. మైనారిటీల్లో భయం పోగొట్టడంలో పాక్‌ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పాక్‌లో తరచుగా జరుగుతున్నాయని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది మూడో ఘటన అని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల్లో ఈ తీరు వల్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు.  

మరిన్ని వార్తలు