మహారాష్ట్రలో కరోనా విజృంభణ

4 Apr, 2021 06:14 IST|Sakshi

సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒకటి రెండు కాకుండా ఏకంగా 49,447 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇప్పటి వరకు నమోదైన సంఖ్య కంటే అత్యధికంగా ఉంది. మరోవైపు 277 మంది మృతి చెందారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు నాలుగు లక్షలు దాటింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 4,01,172 యాక్టివ్‌ కేసులున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే శనివారం కరోనా నుంచి 37,821 మందికి నయమవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

వారం రోజుల్లో మూడు లక్షలు..
రాష్టంలో అత్యం వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి సునామీలా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. ఆరోగ్య శాఖ అందించిన వివరాల మేరకు గత శనివారం మార్చి 27 నుంచి 3,15,712 కరోనా కేసులు నమోదయ్యాయి.

ముంబైలో తొమ్మిది వేలు..
ముంబైలో శనివారం కరోనా కేసులు 9,108 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 27 మంది మృతి చెందారు. అదే విధంగా గత వార ం రోజుల్లో కరోనా రోగుల సంఖ్య 55,684 నమోదు కావడం అత్యంత ఆందోళన కరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పుణేలో మినీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ శనివారం పుణే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 5,778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు.

ఆ విద్యార్థులందరూ పాస్‌
కరోనాతో చిగురుటాకులా వణికిపోతున్న మహారాష్ట్రలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్‌ పరీక్షలు నిర్వహించకుండానే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులందరూ పాస్‌ అయినట్టుగా ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రి వర్ష గ్వైక్వాడ్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. త్వరలోనే 9, 11 తరగతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు