Maharashtra: ఫడ్నవీస్‌కు కీలక శాఖ.. మంత్రులకు శాఖల కేటాయింపులివేనా?

11 Aug, 2022 08:08 IST|Sakshi

సాక్షి,ముంబై: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మినీ మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఎవరికీ మంత్రిత్వ శాఖల కేటాయింపు జరగలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖలు లభిస్తాయనే అంశం తెరమీదకు వచ్చింది.

తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో చర్చ మొదలైంది. దీంతో శిందే, ఫడ్నవీస్‌ తీసుకునే తుది నిర్ణయంపై దృష్టి సారించారు. తాజా మంత్రివర్గ విస్తరణతో శిందే, ఫడ్నవీస్‌తోపాటు మొత్తం 20 మంది మంత్రులు కలిసి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలక పదవైన హోం శాఖను దేవేంద్ర ఫడ్నవీస్‌ దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై శిందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  

మహిళలకు దక్కని ప్రాతినిధ్యం 
ఇదిలాఉండగా రాష్ట్ర కేబినెట్‌లో గరిష్టంగా 43 మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశమున్నప్పటికీ మొదటి దశలో ఇరు వర్గాల నుంచి 18 మందిని చేర్చుకున్నారు. మహిళలకు 50% రిజర్వేషన్‌ అమలులో ఉన్నప్పటికీ 1957–2019 మధ్య కాలంలో కేవలం 40 మంది మహిళలకు మంత్రి మండలిలో స్థానం లభించింది. అందులో 18 మంది మహిళలకు కేబినెట్‌లో, 22మంది మహిళలకు సహాయ మంత్రులుగా పదవులు లభించాయి.

కాగా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిందే, ఫడ్నవీస్‌ వర్గం వద్ద మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. కానీ మొదటిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి వరించలేదు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి శిందే వద్ద నగరాభివృద్ధి శాఖ, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ వద్ద అత్యంత కీలకమైన హోం శాఖను ఉంచుకునే అవకాశాలున్నాయి. మిగతా మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే దానిపై తుది జాబితా అధికారికంగా ప్రకటించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏ మంత్రికి, ఏ శాఖ లభించే అవకాశాలున్నాయో వాటి వివరాలు 

మంత్రివర్గ విస్తరణ ప్రత్యేకతలు 
ఔరంగాబాద్‌ జిల్లాకు ఏకంగా మూడు మంత్రి పదవులు 
మహిళలకు స్థానం కల్పించకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఇదే ప్రథమం 
భాగస్వామ్య పార్టీలకు మంత్రి పదవులు లేవు 
మంత్రివర్గంలో స్థానం లభించిన శిందే వర్గంలోని మంత్రులందరూ ధనవంతులే 
కొత్త మంత్రివర్గంలో చోటు లభించిన మంత్రుల్లో 70% మందిపై వివిధ కేసులు నమోదై ఉన్నాయి 
ఇరు వర్గాల మధ్య 35–65 ఫార్మూల ఒప్పందం ఉన్నప్పటికీ 50–50% మంత్రి పదవులు కేటాయించారు 
నేరారోపణలున్న అబ్దుల్‌ సత్తార్, సంజయ్‌ రాథోడ్‌కు మంత్రివర్గంలో మళ్లీ స్థానం కల్పించడం 

ఇదిలా ఉండగా శిందే, ఫడ్నవీస్‌ వర్గీయులకు మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించడంతో భాగస్వామ్య చిన్న, చితక పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలలో కొంత అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు. తదుపరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది? తమకు అవకాశం ఎప్పుడు లభిస్తుందనే దానిపై ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండో దశ మంత్రివర్గ విస్తరణ సెప్టెంబరులో ఉంటుందని శిందే వర్గానికి చెందిన ప్రహార్‌ సంఘటన ఎమ్మెల్యే బచ్చు కడూ స్పష్టం చేశారు. అందులో అసంతృప్తులందరికీ స్థానం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు