రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం

27 Dec, 2022 15:16 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం మరాఠీ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కూడా. వాస్తవానికి మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదంపై కర్ణాటక శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కొద్దిరోజుల తర్వాత షిండే ఈ తీర్మాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  పైగా బీజేపీ పాలిత రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోందేగానీ తగ్గడం లేదు.

ఐతే మహారాష్ట్ర తీర్మానం ప్రకారం.. బెల్గాం, కార్వార్, బీదర్, నిపాని, భాల్కీలోని ప్రతి అంగుళం సహా 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు ఉ‍న్నాయని, ఆయా గ్రామాల్లో ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందని చెబుతోంది. కానీ కర్ణాటక ఈ వాదనను తోసిపుచ్చటమే గాక తీవ్రంగా ఖండించింది. కర్ణాటక నేల, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని కరాఖండీగా చెప్పింది. ఇది కర్ణాటక ప్రజల భావాలకు సంబంధించినదని, ఈ విషయంలో తాము ఐక్యంగా కట్టుబడి ఉన్నాం అని తేల్చి చెప్పింది. అంతేగాదు రాష్ట్రప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శాసనసభలో ఇటీవలే తీర్మానం కూడా చేశారు.

గతంలో బొమ్మై హోం మంత్రి అమిత్‌ షాతో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, 1956లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సరిహద్దును పునర్నిర్మించాలని డిమాండ్‌ చేయడంతోనే ఈ సరిహద్దు వివాదం రాజుకుంది. అంతేగాక బెలగావి, కార్వార్‌, నిప్పావితో సహా కర్ణాటకకు ఇచ్చిన 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరువర్గాల రాజకీయ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా, ఉథవ్‌ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్‌ రౌత్‌ డిసెంబర్‌ 21న చైనా సరిహద్దు వివాదాన్ని తెర మీదకు తీసుకువస్తూ..చైనా ప్రవేశించినట్లు కర్ణాటకలో అడుగుపెడతాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారం కోల్పోయిన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేస్తూ..కర్ణాటకపై బలమైన వైఖరి అవలంభించ లేదంటూ ఆరోపణలు చేస్తోంది. 

(చదవండి: భారత్‌ జలాల్లోకి పాక్‌ ఫిషింగ్‌ బోట్‌..అప్రమత్తమైన అధికారులు)

మరిన్ని వార్తలు