Uddhav Thackeray: గాలిలో చక్కర్లు  కొట్టలేదు కదా! 

23 May, 2021 09:34 IST|Sakshi

బీజేపీ విమర్శలపై ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు స్పందన 

ముంబై: తుపాను ప్రభావిత కొంకణ్‌ ప్రాంతంలో తన పర్యటనపై ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న విమర్శల పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు. తాను హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయలేదని, క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నానని శనివారం చెప్పారు. గాలిలో చక్కర్లు కొట్టలేదని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ ఇటీవలే గుజరాత్‌లో ఏరియల్‌ సర్వే చేసిన సంగతి తెలిసిందే.

ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం కొంకణ్‌ ప్రాంతంలోని రత్నగిరి, సింధూదుర్గ్‌ జిల్లాల్లో పర్యటించారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను రెండు రోజుల్లోగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉద్ధవ్‌ ఠాక్రే కేవలం 3 గంటలపాటే పర్యటించడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. 3 గంటల్లోనే పంట నష్టాన్ని ఎలా తెలుసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఉద్ధవ్‌ ఠాక్రే బదులిస్తూ.. తాను ఫొటోల కోసం హెలికాప్టర్‌లో పర్యటనకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్లానని అన్నారు.

(చదవండి: ఢిల్లీలో మూతబడ్డ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు)   

మరిన్ని వార్తలు