నా బిడ్డను తెచ్చివ్వండి.. బాధిత మహిళల రోదన

11 Jan, 2021 09:02 IST|Sakshi

భండారా ఆస్పత్రి ఘటనలో బాధిత మహిళల రోదన 

బాధిత మహిళలను పరామర్శించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ 

సాక్షి ముంబై : మహారాష్ట్ర భండారా జిల్లా ఆసుపత్రిలోని చైల్డ్‌ కేర్‌ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మృతి చెందిన నవజాత శిశువుల కుటుంబీకుల్లో తీవ్ర విషాదం నింపింది. ముఖ్యంగా శిశువుల తల్లుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన పిల్లలను నెల రోజులు తిరక్కుండానే కోల్పోవడంతో ఆ తల్లులకు కడుపు కోత మిగిల్చేలా చేసింది. అత్యంత దారుణంగా మృత్యువాత పడ్డారన్న విషాద వార్త వారి గుండెలను తరుక్కుపోయేలా చేస్తోంది. ఇంకా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఏ తల్లిని కదిలిలించినా మా పిల్లలను మాకు అప్పగించండంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. వీరి రోదనలు అందరికీ కన్నీటిని తెప్పించేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు తల్లులు మీడియాతో వారి దుఃఖాన్ని పంచుకున్నారు.

ఉద్ధవ్‌ పరామర్శ 
భండారా జిల్లా ఆసుపత్రిలో మృతి చెందిన నవజాత శిశువుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఆదివారం భేటీ అయ్యారు. అదేవిధంగా ఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చడంతోపాటు ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీచేశారు.  ముంబై అగ్నిమాపక సిబ్బంది చీఫ్‌ పీఎస్‌ రహాందగదలేను కూడా ఈ దర్యాప్తు టీమ్‌లో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో ఫైర్, సేఫ్టీ ఆడిట్‌ చేయాలని సంబంధిత అధికారులను మరోసారి ఆదేశించారు. ఆడిట్‌ జరిగిన ఆసుపత్రులలో కూడా మళ్లీ ఆడిట్‌ చేయాలన్నారు.
 
ఏం మాట్లాడలేకపోయా: సీఎం  
ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులతో భేటీ అయినప్పటికీ వారితో ఏం మాట్లాడలేకపోయా. ఎందుకంటే ఈ సంఘటన అత్యంత హృదయవిదారకరమైనది. బాధితుల కుటుంబీకులతో భేటీ అయిన తర్వాత మాటలు రాక కేవలం వారికి చేతులు జోడించి నిలబడిపోయా. 

పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లారు.. 
నా బిడ్డను నాకు ఇవ్వండంటూ యోగితా ధులసే కన్నీరు మున్నీరవుతోంది. భండారా తాలూకా పహెలా సమీపంలోని శ్రీనగర్‌ గ్రామానికి చెందిన యోగితా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఎదుగుదల అంశంపై చైల్డ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కానీ, తన పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లిన పాప అగ్నిప్రమాదంలో మృతి చెందిందని చెబుతున్నారని యోగిత బోరుమంటోంది. తన బిడ్డను ఇవ్వాలంటూ ఆమె పెట్టే రోదనలు కన్నీటిని తెప్పిస్తున్నాయి.  

9 రోజుల నా పాప ఏం చేసింది? 
‘‘తొమ్మిది రోజుల నా పాప ఏం తప్పు చేసింది. పాప మృతి చెందిందంటూ చెబుతున్నారు’’ అని మోహాడి తాలూకా టాకలా గ్రామానికి చెందిన దుర్గా రాహంగడాలే విలపిస్తోంది. తొమ్మిది రోజుల కిందటే పుట్టిన నా పాపను బలహీనంగా ఉందంటూ చైల్డ్‌ కేర్‌ యూనిట్లో పెట్టారు. కానీ, అక్కడ ఎవరి నిర్లక్ష్యం జరిగిందో ఏమో నా పాప మృతి చెందిందని చెబుతున్నారని బోరుమంది. ఎంతో అందంగా పుట్టిన పాప ఇలా తన నుంచి దూరం అవుతుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆమె రోదిస్తోంది. 

మూడేళ్ల తర్వాత పుట్టింది
పెళ్లయిన మూడేళ్ల తర్వాత కుంభరే దంపతులకు ఆడ పిల్ల పుట్టింది. అయితే ఎక్కువ రోజులు ఆ ఆనందం మిగల్లేదు. శనివారం తెల్లవారుజామున జరిగిన సంఘటనలో వారి పాప మృతి చెందింది. మూడేళ్ల తర్వాత పుట్టిన తన పాప ఇలా విగత జీవిగా మారడానికి కారణం ఎవరంటూ తల్లి కవితా కుంభరే ప్రశ్నిస్తోంది. 

బాబూజీ మేరా  లడకీ ముజే లా దో.. 
సంవత్సరం కిందటే  గీత, విశ్వనాథ్‌ల వివాహం జరిగింది. గీత స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పూరి. 2020 నవంబరు 10వ తేదీన గీత ఆడ బిడ్డకు  జన్మనిచ్చింది. అయితే బరువు తక్కువగా ఉందంటూ బిడ్డను చైల్డ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ఇంతలోనే ఇలా జరిగిందంటూ ఆమె విలపిస్తోంది.  గీత అందరినీ బాబూజీ మేరా లడకీ ముజే లా దో అంటూ దీనంగా అడగడం అందరినీ కంటతపడి పెట్టించింది.  

మరిన్ని వార్తలు