పరిస్థితులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరముంది

12 Mar, 2021 00:23 IST|Sakshi

సాక్షి, మహారాష్ట్ర: కరోనా ఇంకా అదుపులోనే ఉంది, కానీ, పరిస్థితులు చేయిదాటిపోతే లాక్‌డౌన్‌పై ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సంకేతాలిచ్చారు. గురువారం ప్రముఖ జేజే ఆస్పత్రిలో ఉద్ధవ్‌ కరోనా టీకా తీసుకున్నారు. బయటకు వచ్చిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇప్పుడైన పరిస్థితులను సీరియస్‌గా తీసుకోవల్సిన అవసరం ఉంది’’ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని నగరాలలో లాక్‌డౌన్‌ అమల్లో ఉందని, మరికొన్ని చోట్ల పాక్షికంగా అమలుచేస్తున్నారని తెలిపారు.

మొన్నటి వరకు కరోనా కేసులు 10 వేలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 13 వేలకు చేరిందని సీఎం వ్యాఖ్యానించారు. ఇలా సంఖ్య పెరుగుతూ పోతే గత్యంతరం లేక మళ్లీ లాక్‌డౌన్‌ అమలుచేయక తప్పదని హెచ్చరించారు. కరోనా టీకా ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ధవ్‌ చెప్పారు. అయినప్పటికి కరోనా పరిస్తితి ఇలాగే ఉంటే లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదన్నారు. కరోనా టీకా తీసుకునేందుకు అర్హులైన వారు కచ్చితంగా తీసుకోవాలని సీఎం సలహా ఇచ్చారు. ప్రజలు ముఖానికి మాస్క్, సామాజిక దూరం పాటించాలని సూచించారు. లేదంటే గత సంవత్సరం మార్చి 23వ తేదీ నుంచి అమలుచేసి లాక్‌డౌన్‌ పునరావృతం చేయాల్సి వస్తుందని, జనాలు ఇప్పటికైనా జాగృతం కావాలని ఉద్ధవ్‌ పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు