సీఎం హెచ్చరిక.. మరోసారి లాక్‌డౌన్‌ దిశగా..?

18 Feb, 2021 02:19 IST|Sakshi

రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు

పంచాయతీ ఎన్నికలు, లోకల్‌ రైళ్లు తిరగడమే కారణమా ? 

నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్‌ విధిస్తామన్న సీఎం

ముంబై: ‘మాస్క్‌ పెట్టుకోండి. భౌతికదూరం పాటించండి. పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ప్రభుత్వం విధించిన అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలు పాటించండి లేదంటే మరోసారి లాక్‌డౌన్‌కి సిద్ధం కండి’

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ముంబై వాసులకి చేసిన హెచ్చరిక ఇది.  
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ నెమ్మది నెమ్మదిగా సాధారణ జన జీవనం నెలకొంటూ ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు ఇంకా భయపెడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందని శివసేన పార్టీ పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జనవరి తర్వాత గత వారంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంతో పోల్చి చూస్తే రెండో వారంలో 14శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముంబై, పుణే నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నాగపూర్, థానె, అమరావతి పట్టణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఇంకా రెడ్‌ సిగ్నల్‌ పడకపోయినా, ఎల్లో వార్నింగ్‌ అయితే వచ్చింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రమాద ఘంటికలు మోగడానికి ఎంతో సేపు పట్టదు అని రాష్ట్ర కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఠాక్రే లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌనే శరణ్యమని హెచ్చరించారు.

కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..
► కరోనా కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం వంటివేవీ ప్రజలు చేయడం లేదు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న 15 లక్షల మందికి జరిమానాలు వేయడంతో రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని ముంబై మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ వెల్లడించారు.  


► ముంబైలో స్థానిక రైళ్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంక్షల మధ్య తిరుగుతున్నాయి. మొదటి పదిహేను రోజుల్లోనే ఏకంగా 3 వేల మంది ప్రయాణికులు మాస్కులు లేకుండా తిరగడంతో జరిమానాలు విధించారు. గత వారంలో ముంబైలో రోజుకి సగటున వెయ్యి వరకు కేసులు పెరుగుతున్నాయి.  

► ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. విదర్భ, మరఠ్వాడా వంటి ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. అదే ప్రాంతంలోని అమరావతి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల రేటు 33శాతం పెరిగిందని రాష్ట్ర కోవిడ్‌ బృందం అధికారి డాక్టర్‌ ప్రదీప్‌ అవాతే చెప్పారు. కేవలం 199 మంది మాత్రమే ఉన్న ససుర్వె గ్రామంలో పంచాయతీ ఎన్నికల తర్వాత 62 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.  

► గత ఏడాదంతా కోవిడ్‌ కారణంగా వివాహాలు, ఇతర కుటుంబ వేడుకల్ని వాయిదా వేసిన ప్రజలు కొత్త ఏడాదిలో కరోనా కేసులు కాస్త తగ్గడంతో పెద్ద ఎత్తున ఫంక్షన్లు నిర్వహించడం, సమూహాల్లో తిరగడం కేసుల్ని పెంచి పోషించాయి.  

కరోనా ఆంక్షలివే
► పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు 50 మందికి మించి అతిథుల్ని ఆహ్వానించకూడదు
► నిరసన ప్రదర్శనలు, ర్యాలీలపై తాత్కాలిక నిషేధం
► ఒక భవనంలో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే రాకపోకలు పూర్తిగా నిషేధిస్తారు
► మాస్కులు పెట్టుకోకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా భారీగా జరిమానాలు  

మరిన్ని వార్తలు