ఆందోళనకరంగా కరోనా కేసులు.. జీనోమ్‌ పరీక్షల్లో 99% పాజిటివ్‌ 

14 Jun, 2022 14:25 IST|Sakshi

ముంబై: ముంబై మహానగరంలో 12వ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సిరీస్‌లో పరీక్షించిన 279 నమూనాలలో, 278 మందికి కరోనా వైరస్‌కు సంబంధించిన ఒమిక్రాన్‌ సబ్‌–వేరియంట్, డెల్టా స్ట్రెయిన్‌లో ఏదో ఒకటి సోకినట్లు తేలిందని సోమవారం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తెలిపింది. బీఎంసీ నిర్వహిస్తున్న కస్తూర్బా హాస్పిటల్‌లోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లో 12వ సిరీస్‌ బ్యాచ్‌లో 279 కోవిడ్‌ నమూనాలను పరిశీలించినట్లు పౌర సంఘం తెలిపింది. మొత్తంగా, 202 నమూనాలను ముంబై నుంచి సేకరించారు, మిగిలినవి నగరం వెలుపల నుంచి  సేకరించారు.

ముంబైలోని 202 నమూనాలలో, 201 (99.5 శాతం) కరోనా వైరస్‌కు సంబంధించిన  ఒమిక్రాన్‌ సబ్‌–వేరియంట్‌ బ యట పడిందని, ఒకటి డెల్టా స్ట్రెయిన్‌గా గుర్తించామని తెలిపింది. బీఎంసీ వెల్లడించిన వివరాల ప్రకారం, 202 మంది రోగులలో, 24 మంది (12 శా తం) 0 నుండి 20 సంవత్సరాల వయస్సు గల వారు, 88 మంది (44 శాతం) 21 నుంచి 40 సం వత్సరాల వయస్సు గలవారు, 52 మంది రోగులు (26 శాతం) 41 నుంచి 60 సంవత్సరాల వయస్సు లో, 61 నుంచి 80 సంవత్సరాల వయస్సులో 32 (13 శాతం), మరియు ఐదుగురు రోగులు (2 శాతం) మాత్రమే 80 ఏళ్లకంటే ఎక్కువ ఉన్నారు. 0 నుండి 20 సంవత్సరాల వయస్సు గల రోగులలో మొత్తం 24 నమూనాలలో కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ సబ్‌–వేరియంట్‌ బయటపడిందని, అయితే ఎవరిలోనూ తీవ్రమైన లక్షణాలు లేవని సూచించింది. 

వాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌... 
202 మంది రోగులలో ఇద్దరు వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ మాత్రమే తీసుకున్నారు, అయితే రెండు డోస్‌లు తీసుకున్న 129 మంది రోగులలో, తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. ఒకరు  ఐసీయూలో చేరినట్లు బీఎంసీ తెలిపింది. 202 మంది రోగులలో 71 మంది అసలు వ్యాక్సిన్‌ తీసుకోలేదు. వారిలో తొమ్మిది మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు.
చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్‌ పవర్‌ షాక్‌

మరిన్ని వార్తలు