రికవరీ రేటు 96.59 శాతం 

30 Jul, 2021 04:18 IST|Sakshi

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా బాధితుల రికవరీ 

ఒక్కరోజే 11,124 మంది డిశ్చార్జి.. 7,242 మందికి పాజిటివ్‌ 

ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతోంది. గురువారం రికవరీ రేటు 96.59 శాతానికి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. మరణాల రేటు 2.01 శాతంగా ఉంది. గత నెలలో రికవరీ రేటు 93 శాతంగానే ఉంది. అలాగే ఒక్కరోజే 11,124 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 60,75,888కి పెరిగింది. ఇక కొత్తగా 7,242 కోవిడ్‌ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 62,90,156కి చేరుకుంది. గత 24 గంటల్లో 190 మంది కరోనాతో పోరాడుతూ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1,32,335కి చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో 6,857 కొత్త కేసులు, 286 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 1,90,181 కరోనావైరస్‌ పరీక్షలు జరిగాయి, ఇప్పటివరకు అధికారులు రాష్ట్రంలో 4,75,59,938 కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 78,562 క్రియాశీల కేసులు ఉన్నాయి. 4,87,704 మంది గృహ నిర్బంధంలో 3,245 మంది సంస్థాగత నిర్బంధంలో ఉన్నారు. క్రియాశీల రోగులలో పుణే జిల్లాలో అత్యధికంగా 16,177 కేసులు ఉన్నాయి. అలాగే అదే జిల్లాలో అత్యధికంగా 10,52,367 మంది రోగులు కోలుకున్నారు. 

రాజధానిలో 341 కేసులు.. 
గత 24 గంటల్లో రాజధాని ముంబైలోనే కొత్తగా 341 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ కోవిడ్‌ బారినపడిన వారి సంఖ్య   7,35,505 అయింది. ముంబైలో 13 మంది కరోనాతో చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 15,808గా నమోదైంది. ముంబై, ఉపగ్రహ పట్టణాలతో కూడిన ముంబై డివిజన్‌లో ఒక్కరోజులో 1,011 కేసులు నమోదయ్యాయి. పుణే డివిజన్‌లో 2,801 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. లాతూర్‌ డివిజన్‌లో కొత్తగా 375 కరోనా కేసులు నమోదైతే ఔరంగాబాద్‌ డివిజన్లో 94, కొల్లాపూర్‌ డివిజన్లో 1,847 కేసులు నమోదయ్యాయి. కొల్హాపూర్‌ ప్రాంతంలో 48 మరణాలు నమోదయ్యాయి, తరువాత పుణే, ముంబై పరిసర ప్రాంతాలలో వరుసగా 40, 31 మరణాలు సంభవించాయి.

అకోలా డివిజన్‌లో 28, నాగ్‌పూర్‌ డివిజన్లో 32 కేసులు నమోదయ్యాయి. నాసిక్‌ డివిజన్‌లో తాజాగా 1,054  కేసులు నమోదయ్యాయి. భండారా, నందుర్బార్‌ జిల్లాలతో పాటు పర్భని మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏరియాలో గురువారం ఎలాంటి కొత్త కరోనా వైరస్‌ కేసులు రాలేదు. ఔరంగాబాద్, నాసిక్, లాతూర్, నాగ్‌పూర్, అకోలా ప్రాంతాలలో వరుసగా 26, 17,12, 9, 7 తాజా కరోనా మరణాలు నమోదయ్యాయి. థానేలో 292 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 5,43,814కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. గత 24 గంటల్లో జిల్లాలో 11 మంది కోవిడ్‌ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 11,009కి చేరిందని తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 2.02 శాతంగా ఉంది. రికవరీ, క్రియాశీల కేసుల వివరాలను జిల్లా యంత్రాంగం అందించలేదు. పాల్ఘర్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,29,488కి చేరుకోగా మరణాల సంఖ్య 3,190గా ఉందని అధికారులు తెలిపారు.      

మరిన్ని వార్తలు