Maharashtra Political Crisis: శివసేన కార్యకర్తల ఆగ్రహం.. కోడిగుడ్లతో రోడ్లపైకి వచ్చి..

24 Jun, 2022 15:58 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో పాలక మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. షిండేకు వ్యతిరేకంగా జరిగిన తాజా నిరసనలో నాసిక్‌లో కొందరు శివసేన కార్యకర్తలు అతని పోస్టర్‌పై ఇంక్‌ చల్లడంతో పాటు కోడిగుడ్లు విసిరి నిరసనను తెలిపారు. 

మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. రెబల్ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేతో కలిసి గౌహతి క్యాంప్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌ పోస్టర్‌పై ‘మోసగాడు’ అని రాసి శివసేన కార్యకర్తలు తమ నిరసనను తెలిపారు. ఈ ఘటన ఆయన సొంత నియోజకవర్గం మహిమ్‌లో చోటు చేసుకుంది.

పార్టీ శాసనసభ్యులు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటులో చేరిన తర్వాత మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం చెలరేగింది. షిండే శిబిరానికి ప్రస్తుతం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వీరిలో కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.
 

చదవండి: Maharashtra political crisis: షిండే తొలగింపు చెల్లుతుంది!

మరిన్ని వార్తలు