మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగి 32 మంది మృతి

23 Jul, 2021 14:28 IST|Sakshi

ముంబై: భారీ వర్షాలు మహారాష్ట్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు ముంచెత్తడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా రాయగఢ్‌ జిల్లాలోని మహడ్‌ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని కొండ చరియల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. మరో 30 మంది కొండ చరియల కింద చిక్కుకున్నట్లు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. మరోవైపు కొండ చరియలు విరిగిపడటంతో ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు