వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు ఓకే! 

22 Jan, 2021 08:17 IST|Sakshi

బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వ అంగీకారం

ముంబై: ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావును జేజే హాస్పటల్‌ ప్రిజన్‌ వార్డుకు తరలించేందుకు సుముఖంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను డిశ్చార్జ్‌ చేయవచ్చని నానావతి హాస్పటల్‌ వర్గాలు గతవారం కోర్టుకు తెలిపాయి. డిశ్చార్జ్‌ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది. అయితే ఇందుకు బదులుగా ఆయన్ను జేజే హాస్పటల్‌ ప్రిజన్‌ వార్డుకు తరలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్‌ ధాకరే చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్‌కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్‌ఐఏ పరిధిలోనివని చెప్పారు. వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్‌ఐఏ న్యాయవాది అనిల్‌ సింగ్‌ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. 

బెయిల్‌ ఇవ్వండి 
వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన భార్య తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదించారు. జైల్లో సరైన వైద్యసదుపాయం లేకుండా ఆయన్నుంచడం రావు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. జైల్లో ఉన్నవారికి ఆరోగ్య సదుపాయాలు అందించకపోవడం క్రూరత్వమన్నారు. తలోజా జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం మరలా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు నానావతి ఆస్పత్రి వర్గాలిచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు గుర్తు చేశారు. డిశ్చార్జ్‌ అనంతరం జైల్లోకి మరలా వెళితే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరని ఇందిరా వాదించారు. అందువల్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రావు బెయిల్‌కు ఎన్‌ఐఏ అభ్యంతరాలు చెప్పవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ను హైదరాబాద్‌ పంపితే తిరిగి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఎన్‌ఐఏ అభ్యంతరం చెప్పవచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని పడదోయడానికి యత్నించారన్నదే ఆయనపై అభియోగమని గుర్తు చేసింది.

తాము బెయిల్‌ అడుగుతున్నది ఆరోగ్యకారణాలపై కనుక, ఎన్‌ఐఏ అభ్యంతరాలు వర్తించవని, అలాగే ఆయనపై అభియోగాలు నిజం కాదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధాని హత్య గురించిన ఉత్తరం కనుగొన్నట్లు ఎన్‌ఐఏ చెబుతోందని, ఎవరైనా అలాంటి ఉత్తరాలు కంప్యూటర్లలో దాచుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కట్టుకధలన్నారు. కావాలంటే కఠిన నిబంధనలతో కూడిన బెయిల్‌నైనా మంజూరు చేయాలని కోరారు. అయితే రావుకు అన్ని రకాల వైద్యసాయం అందించేందుకు తాము కృషి చేశామని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపా చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్‌ ఇవ్వాలంటే పలు అభ్యంతరాలుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా మానవహక్కులపై పలు డిక్లరేషన్లను ఇందిరా జైసింగ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.  రావు బెయిల్‌ పిటీషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి.    
 

మరిన్ని వార్తలు