BS Koshyari: మహారాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ కోశ్యారీ క్షమాపణలు

1 Aug, 2022 20:06 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమం వేదికగా గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ ‍క్రమంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్‌. ఈ మేరకు మరాఠీలో క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ చేశారు. 

జులై 29న అందేరీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్బంగా.. ‘మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే.. ఇక్కడ డబ్బులే ఉండవు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై కొనసాగదు.’అంటూ పేర్కొన్నారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆయనపై శివసేన, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కష్టపడి పనిచేసే మరాఠీలను అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సైతం తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు గవర్నర్‌ వ్యక్తిగతమని, దానిని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మహారాష్ట్ర గవర్నర్‌ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్‌!

మరిన్ని వార్తలు