అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్‌

9 Nov, 2020 19:00 IST|Sakshi

సాక్షి, ముంబై : ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్ట్‌ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న  రిపబ్లిక్‌ టీవీ  ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి పోలీసులు పలు ఆరోపణలు చేశారు. తనపై జైలు అధికారులు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కలవడానికి అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌కోశ్యారీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అర్నాబ్‌ గోస్వామి అరెస్ట్‌పై రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముక్‌కు ఫోన్‌ చేశారు. వెంటనే అర్నాబ్‌కు తగిన భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం  ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో అర్నాబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం కేసు ఉన్న దశలో తాము మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే తమను సంప్రదించే ముందు అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాల్సిందిగా న్యాయస్థానం అర్నాబ్‌కు సూచించింది. దీనిపై నాలుగు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి గోస్వామి మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురినీ నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గోస్వామి అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు అధికార మహా వికాస్‌ఆఘాడీ ప్రభుత్వంపై  ఆరోపణలు చేశారు. 

మరిన్ని వార్తలు