మహారాష్ట్ర గవర్నర్‌ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్‌!

30 Jul, 2022 12:37 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే రాష్ట్రంలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గవర్నర్‌. 

రాజీనామాకు శివసేన డిమాండ్‌.. 
గవర్నర్‌ వ్యాఖ్యలను ఖండించారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్‌ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్‌ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ ట్వీట్‌ చేశారు రౌత్‌. 

మరోవైపు.. కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘రాష్ట్ర ప్రజలను గవర్నర్‌ అవమానించటం చాలా బాధాకరం. ఆయన పదవీ కాలంలో గవర్నర్‌ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.. రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారు.’ అని పేర్కొన్నారు సచిన్‌ సావంత్‌. గవర్నర్‌ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. లేదంటే ఆయనను తొలగించాలని కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఇది సరైనదేనా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హో.. వారి కెబినెట్‌ మంత్రులకు ఆమోదం లభించనందుకేమో.. అంటూ ఎద్దేవ చేశారు ప్రియాంక.

ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్‌జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్‌.. మరో 6 నెలలు..!

మరిన్ని వార్తలు