15 జిల్లాల్లో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ 

23 May, 2021 03:17 IST|Sakshi

కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ చర్యలు 

ముంబై సెంట్రల్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా మహమ్మారి విశ్వరూపం ఇంకా కొనసాగుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి, బుల్డాణా, కొల్హాపూర్, సాంగ్లీ, యవత్మాల్, షోలాపూర్, సతారా, అహ్మద్‌నగర్, ఉస్మానాబాద్, అకోలా, వాశిం, బీడ్, గడ్చిరోలి, రత్నగిరి, సింధుదుర్గ్‌ తదితర 15 జిల్లాల్లో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని, లక్షణాలున్న వ్యక్తుల్ని హోం క్వారంటైన్‌కు బదులుగా ఐసోలేషన్‌ చేయాలని స్థానిక పరిపాలనా యంత్రాంగానికి  ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

అన్ని జిల్లాలతో పాటే ఈ 15 జిల్లాల్లోనూ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ దాని ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఏప్రిల్‌ రెండో వారంలో నమోదైన కేసుల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కరోనా పరిస్థితి కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇదే అంశాన్ని చర్చించేందుకు శుక్రవారం మంత్రి బాలాసాహెబ్‌ థోరాత్‌ నేతృత్వంలో జిల్లాధికారులు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ 15 జిల్లాల్లో కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి బాలాసాహెబ్‌ థోరాత్‌ మాట్లాడుతూ.. ఈ 15 జిల్లాల బాధ్యతను ముఖ్యమంత్రి తనకు అప్పగించారని, లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ కేసులు ఎందుకు తగ్గడం లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. నిర్ధారణ పరీక్షల్ని పెంచాలని, పరీక్షలు పెరిగితే కేసులు పెరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి సకాలంలో చికిత్స అందితే కరోనా వ్యాప్తి తగ్గుతుందని, బాధితులు వెంటిలేటర్‌ వరకు వెళ్ళే ప్రమాదం తప్పుతుందని థోరాత్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే, వైద్య విద్య శాఖ మంత్రి అమిత్‌ దేశ్‌ముఖ్‌లు కూడా పాల్గొన్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు