సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డంపై అభ్యంత‌రం

5 Aug, 2020 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  ఆత్మ‌హ‌త్య కేసును  సీబీఐకి బ‌దిలిచేయడాన్ని మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం వ్య‌తిరేకించింది. బీహార్ పోలీసుల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, వాస్త‌వానికి ఈ కేసు ద‌ర్యాప్తు చేయ‌డానికి ముంబై పోలీసుల‌కై అధికారం ఉంద‌ని తెలిపింది. బీహార్ పోలీసులు కొంద‌రు రాజ‌కీయ నేత‌ల ప్రోద్భ‌లంతో ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపించింది. అంతేకాకుండా సుశాంత్ తండ్రి మహారాష్ర్ట‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేద‌ని ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య  కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి  దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ హృషేష్ రాయ్  నేతృత్వంలో బుధ‌వారం  సుప్రీంకోర్టులో విచారణ చేప‌ట్టింది.  ఈ సంద‌ర్భంగా  ముంబై పోలీసుల చ‌ర్య‌ను సుప్రీం త‌ప్పుబ‌ట్టింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్  నుంచి ముంబై వచ్చిన పోలీస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని సుప్రీంకోర్టు వ్య‌తిరేకించింది. ఇది త‌ప్పుడు సంకేతాలు పంపుతుంద‌ని వ్యాఖ్యానించింది.  కేసు విచార‌ణ‌ను నిజాయితీగా జ‌రిగేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. (‘ఆమెపై హత్యాచారానికి తెగబడ్డారు’)


సుశాంత్ మృతికి సంబంధించిన ద‌ర్యాప్తు వివ‌రాల‌ను రికార్డులో ఉంచాల‌ని మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వాన్ని ధ‌ర్మాస‌నం కోరింది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. నిజాలు బ‌య‌ట‌కు రావాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాదారాల‌ను నాశ‌నం చేశారంటూ ఆరోపించిన  సుశాంత్ కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని,  అన్ని సాక్ష్యాల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటామంటూ జ‌స్టిస్ రాయ్ హామీ ఇచ్చారు. ఇక సుశాంత్ అనుమాన‌స్ప‌ద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం  చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.  (సుశాంత్‌ మృతిపై  సీబీఐ విచారణ)

మరిన్ని వార్తలు