మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

5 Dec, 2021 06:22 IST|Sakshi

ముంబై/అహ్మదాబాద్‌: దేశంలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శనివారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్, మహారాష్ట్రలో ఈ కేసులు బయటపడ్డాయి. ‘వైరస్‌ ముప్పు’ దేశాల జాబితాలో ఉన్న జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కి వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడికి ఒమిక్రాన్‌ వేరియెంట్‌ సోకినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులొచ్చాయి. జింబాబ్వే నుంచి గుజరాత్‌కి ఆ వృద్ధుడు నవంబర్‌ 28న వచ్చారు.

డిసెంబర్‌ 2న అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణమైంది. ఆ తర్వాత శాంపిళ్లని జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌గా తేలిందని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ చెప్పారు.  మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల వయసున్న వ్యక్తి నవంబర్‌ చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ఢిల్లీకి వచ్చారు. ఆపై ముంబై విమానాశ్రయంలో దిగిన అతనిలో జ్వరంగా కనిపించింది. అతను ఇప్పటివరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోలేదు.  అతనిని కరోనా సోకినట్లు వెల్లడికావడంతో ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. జన్యుక్రమ విశ్లేషణలో అతనికి సోకింది ఒమిక్రాన్‌ వేరియెంటేనని తేలింది.

ఆ ప్రయాణికులు ఎక్కడ?
న్యూఢిల్లీ: ఒకవైపు ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అందరి గుండెల్లో దడ పెంచుతూ ఉంటే అత్యంత ముప్పు కలిగిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల నుంచి అధికారుల కళ్లు గప్పి పారిపోవడం అధికారుల్లో టెన్షన్‌ పెంచుతోంది. వారిలో ఎంతమందికి ఇప్పటికే కరోనా సోకి ఉంటుందన్న ఆందోళనతో అధికారులు వారి కోసం వేట మొదలు పెట్టారు. ఆ మిస్సింగ్‌ కేసులు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గుదిబండగా మారాయి. 

విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి వచ్చిన ప్రయాణికులు 300 మందిలో దాదాపుగా 13 మంది అధికారుల కళ్లు గప్పి పారిపోవడమే కాదు, తప్పుడు చిరునామాలు, కాంటాక్ట్‌ నెంబర్లు ఇవ్వడం అధికారులకి తలకాయ నొప్పిగా మారింది. ఈ 13 మందిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వారిని కనిపెట్టి పరీక్షలు నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది.  n దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన 10 మంది ప్రయాణికులు కనిపించకుండా పోవడం ఆందోళన పుట్టిస్తోంది. విమానాశ్రయంలో  భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ వాళ్లు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోయారని కర్ణాటక రెవిన్యూశాఖ మంత్రి ఆర్‌. అశోక్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు