టీకా కుంభకోణం.. సర్టిఫికెట్లను రద్దు చేయండి..!

8 Jul, 2021 15:47 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో నకిలీ టీకా ఇచ్చిన బాధితుల సర్టిఫికెట్లను రద్దు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ముంబై, థానే, నవీ ముంబైలలో జరిగిన నకిలీ టీకా డ్రైవ్ సందర్భంగా.. టీకా తీసుకోకున్న.. వేయించుకున్నట్లు వచ్చిన ప్రజలందరి కోవిన్‌ సర్టిఫికెట్లు  రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తన లేఖలో కోరనుంది. కోవిన్ సైట్ నుంచి డేటాను తొలగించిన తర్వాత, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బాధితులందరికీ టీకాలు వేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. నిందితులు 5 వేలకు పైగా నకిలీ టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు.

నకిలీ వాక్సినేషన్ స్కామ్:
ముంబైలోని కండివాలి (వెస్ట్)లో హిరానందాని హెరిటేజ్ క్లబ్ నివాసితులు తమకు మే 30న నకిలీ కోవిడ్-19 టీకాలు ఇచ్చినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, బోరివాలికి చెందిన ఆదిత్య కళాశాల వారు తమ క్యాంపస్‌లో నకిలీ టీకా డ్రైవ్ చేశారని ఓ బృందంపై ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై, సమీప ప్రాంతాలలో ఇలాంటి అనేక కేసులు నమోదయ్యాయి. టీకా డ్రైవ్ సమయంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌కు బదులుగా ప్రజలకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషయంపై ముంబై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేసుకు సంబంధించి 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కీలక నిందితులతో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ కేసు తీవ్రమైనదిగా పేర్కొన్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఠాక్రే తెలిపారు.

>
మరిన్ని వార్తలు