అనాథకు ‘కన్యాదానం’ చేసిన హోం మినిస్టర్‌

21 Dec, 2020 09:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆదర్శంగా నిలిచిన హోం మినిస్టర్,‌ కలెక్టర్‌ దంపతులు

ముంబై: తెలుగు సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు. దాంతో అనిల్‌ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. మీరు చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అభినందిస్తున్నారు. అలానే వరుడి తరఫున తండ్రి బాద్యతలు నిర్వహించిన నాగ్‌పూర్‌ కలెక్టర్‌ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.  (చదవండి: పేగుబంధం 'అన్వేషణ')

వివరాలు.. ఆదివారం నాగ్‌పూర్‌ జిల్లాలోని ఒక అనాథ ఆశ్రమంలో చెవిటి యువతి(23) వివాహం మరో అనాథ యువకుడి(27)తో జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు తరఫున కన్యాదానం చేశారు హోం మంత్రి దంపతులు. ఇక నాగ్‌పూర్‌ కలెక్టర్‌ రవీంద్ర ఠాక్రే వరుడి తరఫున తండ్రి బాధ్యతలు నిర్వహించారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహ తంతు జరిపించడంతో ఆ యువ జంట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా హాజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక సదరు యువతిని 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలోని ఓ అనాథాశ్రమం నిర్వహాకులు ఆమెని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. ఇక వరుడుని కూడా రెండేళ్ల వయసులో థానే జిల్లాలోని డొంబివాలి టౌన్‌షిప్‌లో వదిలేసి వేళ్లారు అతడి తల్లిదండ్రులు. 

మరిన్ని వార్తలు