స్టీల్‌ వ్యాపారి కార్యాలయాలపై ఐటీ దాడులు.. వంద కోట్ల ఆస్తులు, డబ్బులు లెక్కించడానికి 13 గంటలు

11 Aug, 2022 10:11 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులతో బిజీగా మారాయి. సీబీఐ, ఈడీ, ఐటీ ఇలా ప్రతి సంస్థ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు, దర్యాప్తులు ముమ్మరం చేశాయి. ఇటీవల టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జల్నాలో ఓ బడా వ్యాపారికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి 8 వరకు ఈ దాడులు నిర్వహించింది. ఐటీ అధికారుల తనిఖీల్లో వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: 70 ఏళ్లుగా ఉండేది.. బావి కనపడుట లేదని పోలీసులకు ఫిర్యాదు

ఈ సోదాల్లో రూ. 56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, ముత్యాలు, వజ్రాలు, ప్రాపర్టీ పేపర్లతో సహా దాదాపు రూ. 100 కోట్ల బినామీ ఆస్తులను అధికారులు సీజ్‌ చేశారు. పట్టుబడిన నగదును లెక్కించేందుకు అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టింది. అయితే ఈ ఆస్తులు ఎవరికి సంబంధించినవో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

మరిన్ని వార్తలు