Herwad Village: వితంతువులపై గ్రామ పంచాయితీ సంచలన తీర్మానం.. దేశంలోనే తొలి గ్రామం

21 May, 2022 09:33 IST|Sakshi

రాష్ట్రంలో కొల్హాపూర్‌ జిల్లా హెర్వాడ్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

మహిళా, ప్రజా సంఘాల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్‌

ముంబై: భర్త చనిపోయిన వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తీసుకురావాలని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విధవరాళ్లకు చేసే ఆచారాలను వ్యతిరేకిస్తూ ఇటీవల కొల్హాపూర్‌ జిల్లాలోని హెర్వాడ్‌ గ్రామం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించే హక్కును కల్పించేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికైనా వితంతు తిరోగమన పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  వితంతు మహిళల పట్ల తిరోగమన ఆచారాలకు వ్యతిరేకంగా ఇటీవల కొల్హాపూర్‌ జిల్లాలోని హెర్వాడ్‌ గ్రామంలో ఈనెల 4న చేసిన తీర్మానానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇదేవిధమైన తీర్మానాలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హెర్వాడ్‌ మోడల్‌ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

వింతతు మహిళల పట్ల చేసే ఆచార వ్యవహారాలైన గాజుల విరగ్గొట్టడం, వాటిని తీసివేయడం, మరెప్పుడూ ధరించకుండా నిషేధించడం, బొట్టు (సింధూరాన్ని) తీసివేయడం, మంగళసూత్రాన్ని తెంచివేయడం, కాలి మెట్టెల్ని తీసివేయడం వంటి ఆచారాల్ని ఇకపై పాటించకుండా షిరోల్‌ తాలూకాలోని హెర్వాడ్‌ గ్రామ పంచాయతీ తీర్మానించింది. వివాహ వేడుకలు, శుభకార్యాలు, మతపరమైన వేడుకలు, సామూహిక వేడుకల్లో పాల్గొనకూడదనే సంప్రదాయాన్ని హెర్వాడ్‌ పంచాయతీ తీర్మానంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇకపై అటువంటి ఆచారాలను వితంతు మహిళలెవరూ గ్రామంలో ఎవరూ పాటించనవసరంలేదని తేల్చిచెప్పింది. 

ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ తీర్మానం
ఈ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వితంతు మహిళలు మరింత గౌరవంగా జీవించే హక్కును కల్పించడంతో పాటుగా ఇతర గ్రామ పంచాయతీలకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. హెర్వాడ్‌ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వెనుక షోలాపూర్‌ జిల్లాలలోని సంఘ సంస్కర్త మహాత్మ పూలే సామాజిక సంక్షేమ సంస్థకు చెందిన ప్రతినిధి ప్రమోద్‌ జింజాడే చాలా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...వితంతు మహిళలు గౌరవంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న తొలి గ్రామంగా దేశ చరిత్రలోనే హెర్వాడ్‌ గ్రామం నిలిచిందని జింజాడే పేర్కొన్నారు.

ఈ తీర్మానాన్ని మరో ఏడు గ్రామ పంచాయతీలు అనుసరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఇటువంటి తీర్మానాలు కూడా దురాచారాలను రూపుమాపలేవని, వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు చట్టాలు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయడమే సమస్యకు అసలు పరిష్కారమని ఆయన తెలిపారు. దీనిపై చట్టాన్ని చేసేందుకు మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ నీలం గొర్హెతో సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలోని రెండు సభల్లోనూ జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో చర్చకు పెట్టేలా చూస్తాననని ఆమె హామీనిచ్చినట్లు ప్రమోద్‌ జింజాడే తెలిపారు.
చదవండి: రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని..

అయితే ఈ విషయానికి సంబంధించి కొత్త చట్టం చేయాలా లేదా పాత చట్టాల ద్వారానే అమలు చేయవచ్చా అనే అంశాన్ని న్యాయ విభాగం ఒకసారి పరిశీలించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వితంతు మహిళలపట్ల ఈ విధమైన దురాచారాలకు పాల్పడే గ్రామస్తులు, బయటవారిపై ఏడాది పాటు జైలు శిక్షను, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని ప్రమోద్‌ జింజాడే మండలి డిప్యూటీ చైర్మన్‌ గొర్హెకు ప్రతిపాదించారు. అదే బంధువులైతే 15 రోజుల నుంచి నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.50వేలకు వరకు జరిమానా విధించా లని ఆయన ప్రతిపాదించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆ కమిటీలో 50 శాతం మహిళలే ఉండాలని, అందులో సగంమంది వితంతువులు ఉండాలని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు