Maharashtra: లోకల్‌ రైలు ఇప్పట్లో  లేనట్లే!

28 Jun, 2021 18:25 IST|Sakshi

నూతన మార్గదర్శకాలతో సామాన్యులకు దక్కని ప్రయాణం

అనుమతి రావాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పని పరిస్థితి 

సాక్షి, ముంబై: సామాన్యులకు లోకల్‌ రైళ్లలో ప్రవేశించేందుకు అనుమతి ఇప్పట్లో లభించే అవకాశాలు కన్పించడం లేదు. భయాందోళనలు సృష్టిస్తున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌తోపాటు థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినం చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి సామాన్య ప్రయాణికులకు లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి లభించేలా కన్పించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజ మార్గదర్శకాలనుసారం లోకల్‌ రైళ్లలో కేవలం అత్యవసర సేవలందించే వారి జాబితాలో ఉన్నవారికే అనుమతి కొనసాగనుందని తెలుస్తోంది.  

పాజిటివ్‌ కేసులు తగ్గినా.. 
సెకండ్‌ వేవ్‌లో ముంబైతోపాటు మహారాష్ట్రను హడలెత్తించిన కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. థానేతోపాటు పలు జిల్లాల్లో పాజిటివ్‌ రేట్‌ 5 శాతం కంటే తక్కువ కావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేశారు. దీంతో తొందర్లోనే లోకల్‌ రైళ్లలో అందరికీ ప్రయాణించేందుకు అనుమతి లభించనుందని భావించారు. దీనిపై అధికారులు కూడా రెండు మూడు రోజులలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటనలు చేశారు. కాని అంతలోనే డెల్టా వేరియంట్‌ రాష్టంలో ప్రవేశించింది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా నిపుణులు చెప్పే డెల్టా వేరియంట్‌తో రత్నగిరి జిల్లాల్లో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. దీంతోపాటు థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని, అలాగే ఈ థర్ఢ్‌ వేవ్‌లో సుమారు 50 లక్షల మంది కరోనా బారిన పడే అవకశాలున్నాయని రాష్ట ఆరోగ్య శాఖ పేర్కొంది.

వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఆంక్షలను కఠినం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లోకల్‌ రైళ్లలో సామాన్య ప్రజలకు ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని భావించిన వారి ఆశలు ఆడియాశలే అయ్యాయి. వచ్చే నెలలో లోకల్‌ రైళ్లల్లో ప్రయాణించేందుకు సామాన్యలకు అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది. 80 లక్షల మంది ప్రయాణించే లోకల్‌ రైళ్లలో ప్రస్తుతం అత్యవసర సేవలందించే వారికి అనుమతిస్తున్నారు. దీంతో ప్రతి రోజులు ప్రస్తుతం సుమారు 22 లక్షల మంది  ప్రయాణిస్తున్నారు.

దీంతో సామాన్య ప్రజలకు అనుమతించినట్లయితే ప్రయాణికుల రద్దీపై నియంత్రణ బాధ్యతల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని తెలిసింది. అయితే ఈ సారి మాత్రం కరోనా కేసులు కూడా కొంత మేర తగ్గుతుండటంతో తొందర్లోనే అందరికీ అను మతి లభించే అవకాశాలున్నాయని అందరు భావించారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాలతో మరికొన్ని రోజులపాటు వేచి చూడాల్సి రానుంది. కరోనా మూడో దఫా (థర్డ్‌ వేవ్‌) వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సంక్రమణకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అన్ని విధాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చదవండి: Delta Variant: మళ్లీ కఠిన ఆంక్షలు

మరిన్ని వార్తలు