లాక్‌డౌన్‌ పొడిగింపుపై 30న తుది నిర్ణయం

29 Apr, 2021 02:35 IST|Sakshi

అందరికీ ఉచిత టీకా

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటన 

ప్రభుత్వం వద్ద కరోనా టీకాల కొరత ఉందని వెల్లడి 

మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్లు వేయలేమని వివరణ 

లాక్‌డౌన్‌ పొడిగింపుపై 30న నిర్ణయం: మంత్రి రాజేశ్‌

ముంబై: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా వేస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం ప్రకటించారు. అయితే అందరికీ టీకాలు వచ్చే నెల 1 నుంచి వేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం వద్ద వ్యాక్సిన్‌ నిల్వలు తగినంతగా లేనందున మే 1 నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న వారందరికీ టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని బుధవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 5.71 కోట్ల మంది పౌరులకు టీకాలు వేయాలంటే రూ.6,500 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. చివరకు ఈ ఖర్చులు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిందని రాజేశ్‌ టోపే వెల్లడించారు. లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయని అయితే నిర్ణయం ఈనెల 30న వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. 

ఎన్సీపీ ప్రకటనతో గందరగోళం.. 
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా కరోనా టీకా వేస్తున్నారు. కానీ, మే ఒకటో తేదీ నుంచి 18 నుంచి 44 ఏళ్లలోపు యువకులందరికీ కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పేచి మొదలైంది. దీంతో ఈ వయసు వారందరికి టీకా ఉచితంగా వేస్తారా లేక నిర్ణీత రుసుం తీసుకుంటారా..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన ఎన్సీపీ నాయకుడు నవాబ్‌ మలిక్‌ ఉచితంగా టీకా వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు పార్టీల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ప్రభుత్వంలో ఒక పార్టీ ఎలా ప్రకటిస్తుందని కాంగ్రెస్‌ నాయకులు నిలదీశారు. ఈ విషయాన్ని ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికే ఉందని స్పష్టం చేశారు. చివరకు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి తెరపడింది.

కమిటీ ఏర్పాటు.. 
వచ్చే ఆరు నెలల్లో ప్రణాళికాబద్దంగా టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్లు అందుతాయని రాజేశ్‌ టోపే పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రివర్గంలో ఆమోదముద్ర పడినట్లు మంత్రి తెలిపారు. టీకాల కోసం కోవిన్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని రాజేశ్‌ టోపే సూచించారు. టీకా కార్యక్రమాన్ని అమలు చేయడం గురించి సూక్ష్మ ప్రణాళిక వేయడానికి ఆరోగ్య శాఖ ప్రతినిధులు, కొంతమంది సీనియర్‌ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 18–25, 25–35, 35–44 వయస్సు గల వారిని వర్గీకరించవచ్చా అని కమిటీ ఆలోచిస్తోందని రాజేశ్‌ తెలిపారు.

త్వరితగతిన టీకాలు వేసి ఇమ్యునిటీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోవిషీల్డ్, కోవాక్సిన్‌ తయారీదారుల నుంచి మాత్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కోవాక్సిన్‌ ఉత్పత్తి చేసే భారత్‌ బయోటెక్‌ మోతాదుకు రూ. 600 చొప్పున వ్యాక్సిన్‌ అందిస్తుందని తెలిపారు. మే, జూన్‌ నెలల్లో నెలకు 10 లక్షలను సరఫరా చేస్తామని ఆ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం నెలకు 20 లక్షల మోతాదులను సరఫరా చేస్తామని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. చదవండి: (లాక్‌డౌన్‌ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు')

సీరం నుంచి కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లు నెలకు కోటి వరకు సరఫరా చేయవచ్చని ఆరోగ్య శాఖమంత్రి స్పష్టంచేశారు. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీపై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అందుబాటు ధరలో స్పుత్నిక్‌ అందించనట్లయితే ఆ వ్యాక్సిన్‌ కూడా ఎంపిక చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో జైడస్‌ కాడిలా, జాన్సన్‌  జాన్సన్‌ వంటి తయారీదారుల నుంచి వ్యాక్సిన్ల సరఫరాను పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాష్ట్రానికి రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్లు వంటి కీలకమైన ఔషధాల సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను సంప్రదించాలని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకులు (కేంద్ర మంత్రి) నితిన్‌ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవిస్, ప్రవీణ్‌ దారేకర్‌లకు రాజేశ్‌ టోపే సూచించారు. 

లాక్‌డౌన్‌ పొడిగింపు? 
మంత్రివర్గ సమావేశంలో మే ఒకటో తేదీ తరువాత లాక్‌డౌన్‌ కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, దీంతో గడువు పెంచితే బాగుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ పొడగించే విషయంపై ఏప్రిల్‌ 30వ తేదీన తుది నిర్ణయం తీసుంటారని టోపే తెలిపారు. అయితే 15 రోజులు పొడగించాలా..? లేక ఎక్కువ రోజులు పొడగించాలనే దానిపై అదే రోజు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ నెల 14వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి మే ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల వరకు లాక్‌డౌన్‌ అమలుచేసిన సంగతి తెలిసిందే. సమయం దగ్గరపడటంతో ప్రజల్లో లాక్‌డౌన్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది.  

మరిన్ని వార్తలు