న్యాయం కోసం 50 ఏళ్లకు పైగా పోరాటం.. చివరకు 108వ ఏట మృతి

22 Jul, 2021 11:28 IST|Sakshi

భూవివాదంలో 50ఏళ్లకు పైగా పోరాడుతున్న వ్యక్తి

సుప్రీంకోర్టులో విచారణకు ముందు 108వ ఏట మృతి

న్యూఢిల్లీ: వంద మంది దోషులను విడిచిపెట్టినా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా అన్యాయం జరగకూడదనేది భారత న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. దీని వల్ల మేలు ఎంతో కీడు కూడా అంతే జరగుతుంది. ఒక్కసారి కేసు కోర్టుకు వెళ్తే విచారణ పూర్తయి తీర్పు వచ్చే వరకు ఆ కేసుకు సంబంధించిన వారు ఎందరు ఉంటారో.. ఎందరు కన్నుముస్తారో చెప్పడం కష్టం.

తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ భూవివాద కేసు విచారణ ఏకంగా 53 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. చివరకు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు అంగీకరించే సమయానికి.. పిటీషన్‌దారు అయిన సదరు వృద్ధుడు తన 108వ ఏట కొన్ని రోజుల క్రితం మరణించాడు.

కేసేంటంటే..
ఆ వివరాలు.. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందిన సోపాన్‌ నర్సింగ్‌ గైక్వాడ్‌ అనే వ్యక్తి 1968లో రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సోపాన్‌కు తాను కొనుగోలు చేసిన భూమిని దాని అసలు యజమాని అప్పటికే బ్యాంక్‌లో తాకట్టు పెట్టి లోన్‌ తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక అసలు యజమాని లోన్‌ చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ భూమిని జప్తు చేస్తామని సోపాన్‌కు నోటీసులు జారీ చేశారు. 

దాంతో సోపాన్‌ దీని మీద ట్రయల్‌ కోర్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో సోపాన్‌ ఆ భూమికి బోనాఫైడ్‌ కొనుగాలుదారుగా ఉంటాడని.. బ్యాంక్‌ అసలు యజమానికి చెందిన ఇతర ఆస్తులను అమ్మడం ద్వారా లోన్‌ని రికవరీ చేసుకోవచ్చని తెలిపింది. ట్రయల్‌ కోర్టు సోపాన్‌ వాదనను అంగీకరించడమే కాక సెప్టెంబర్‌ 10, 1982లో అతడికి అనుకూలంగా ఉత్తర్వును జారీ చేసింది. దాంతో అసలు యజమాని మొదటి అప్పీల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో 1987లో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును తారుమారు చేశారు. ఆ తర్వాత సోపాన్‌ సెకండ్‌ అప్పీల్‌లో భాగంగా 1988లో హైకోర్టుకు వెళ్లాడు. 2015లో బాంబే హైకోర్టు దీన్ని కొట్టేసింది. 

సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో ఆలస్యం..
ఈ క్రమంలో సోపాన్‌ తరఫు కదీమ్‌ న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ఇరు వర్గాల న్యాయవాదులు ఆగస్టు 22, 2015న హైకోర్టులో హాజరయ్యారు.. సూచనలను కోరేందుకు వాయిదా వేశారు. దాంతో రెండో అప్పీల్‌ సెప్పెంబర్‌ 3, 2015కి వాయిదా పడింది. చివరకు అక్టోబర్‌ 23, 2015న బాంబే హైకోర్టు దీన్ని కొట్టేసింది’’ అని తెలిపారు. సెకండ్‌ అప్పీల్‌ను పునరుద్దరించమని కోరడంలో ఆలస్యం అయిందని.. ఇందుకు క్షమించాల్సిందిగా కోరుతూ ఓ దరఖాస్తు కూడా దాఖలు చేశామని కదీమ్‌ తెలిపాడు. అయితే దీన్ని కూడా ఫిబ్రవరి 13, 2019లో కొట్టివేశారని వెల్లడించాడు. 

పిటీషన్‌దారు మారుమూల ప్రాంతానికి చెందినవాడు కావడం, హైకోర్టు తీర్పు వెల్లడించడంలో జరిగిన జాప్యం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో ఆలస్యం అయ్యిందని కదీమ్‌ తెలిపాడు. దాంతో ఈ ఏడాది జూలై 12న అప్పీల్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా సుప్రీంకోర్టు విచారణలో కూడా జాప్యం చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ కదమ్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, "దురదృష్టవశాత్తు, తన కేసును ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకొచ్చిన వ్యక్తి, తన అప్పీల్‌ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించే నాటికి సజీవంగా లేరు. అతను ఇప్పుడు చట్టపరమైన వారసుల ద్వారా విచారణ కొనసాగుతుంది’’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు